వేడుక‌గా వెంక‌న్న పుష్ప‌యాగం

Pushpa Yagam performed at Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌ని‌వారం పుష్పయాగ మహోత్సవం శోభాయ‌మానంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్లగానీ జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేశారు. చామంతి, వృక్షి, సంపంగి, సెంటు జాజులు, పొగ‌డ‌, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.

 పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. అనంతరం స్వామివారు తన దేవేరులతో కలిసి సహ‌స్ర‌దీపాలంకార సేవ‌లో పాల్గొన్నారు. ఆ త‌రువాత ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు విరాళంగా అందించారు. త‌మిళ‌నాడు నుండి 4 ట‌న్నులు, క‌ర్ణాట‌క నుండి 2 ట‌న్నులు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుండి క‌లిపి ఒక ట‌న్ను పుష్పాలు, ప‌త్రాలను దాతలు అంద‌జేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top