ఆర్టీసీ ప్రైవేటు హా'రన్‌' | Public transport is moving towards a complete shutdown | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రైవేటు హా'రన్‌'

Jun 7 2026 5:14 AM | Updated on Jun 7 2026 5:14 AM

Public transport is moving towards a complete shutdown

కౌంట్‌డౌన్‌ మొదలు 

దశలవారీగా 85 % బస్సుల తొలగింపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. సర్కారు ప్రైవేటు హారన్‌ మోగిస్తోంది. ఇ–బస్సుల ముసుగులో  2031 నాటికి  ప్రజా రవాణా సంస్థను పూర్తిగా మూసివేసే దిశగా పరుగులు తీస్తోంది. దీనిలో భాగంగానే ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకూడదని కుట్ర పన్నింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అభ్యంతరాలు, వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్న బస్సులను దశలవారీగా తొలగించేందుకు పావులు కదుపుతోంది. 

వాటి స్థానంలో ప్రైవేటు సంస్థల ద్వారా ఇ–బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈమేరకు ప్రతిపాదనలు సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ ప్రైవేటుపరానికి సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇక మీదట ఆర్టీసీ కోసం కొత్త డీజిల్‌ బస్సులను కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు. ఇ–బస్సులను ఆర్టీసీయే స్వయంగా నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను తిరస్కరించారు.

ఆర్టీసీ ఉన్నతాధికారుల ప్రతిపాదనలివీ..  
» 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆర్టీసీలో 11వేల బస్సులు ఉండేవి. గత రెండేళ్లలో కాలం చెల్లిన దాదాపు వెయ్యి బస్సులను తొలగించారు. ఆర్టీసీ అవసరాలకు నిర్దేశిత బస్సుల కంటే మొత్తం 2,689 బస్సుల కొరత ఉంది.  గత ఆరు నెలల్లోనే 264 బస్సులు తొలగించారు. వాటి స్థానంలో కొత్త డీజిల్‌ బస్సులను ప్రవేశపెట్ట లేదు. ప్రసుతం ఆర్టీసీ బస్సుల సంఖ్య 10వేల కంటే తగ్గింది. వాటిలో దాదాపు 3వేల బస్సులు అద్దె ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. అద్దె ఒప్పందం  కాలపరిమితి ముగియగానే వాటిని తొలగిస్తారు. కొత్తగా అద్దె విధానంలో డీజిల్‌ బస్సులను ప్రవేశపెట్టరు. దీంతో నికరంగా ఆర్టీసీకి చెందిన బస్సులు దాదాపు 7వేలు మాత్రమే ఉంటాయి. 

» ఇక 15ఏళ్లు కాలపరిమితి దాటిన బస్సులను ఇప్పటికిప్పుడు తొలగించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆ కార్యాచరణను అమలు చేస్తోంది. సగటున రెండు రోజులకు ఒక బస్సును తొలగిస్తోంది. 2031 నాటికి మరో 6,442 బస్సులను తొలగించాలని నిర్ణయించింది. అంటే 85శాతం బస్సులను తొలగించాలనేది లక్ష్యం.

కొత్త ఉద్యోగాల భర్తీకీ తిలోదకాలు 
ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. ఏడాదిలో 617 మంది డ్రైవర్లు, 821 మంది కండక్టర్లు రిటైరయ్యారు. అంటే 1,438 పోస్టులు ఖాళీ అయ్యాయి. మొత్తం ఆర్టీసీ­లో దాదాపు 8వేలకుపైగా పోస్టులు ఖాళీ­గా ఉన్నాయి. అయినా సరే ఆ పోస్టులను భర్తీ చేసే ఉద్దేశమేలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. 2029 నాటికి ఆర్టీసీలో  50శాతం పోస్టులు ఖాళీ అవుతాయి. 2031 నాటికి 65 శాతం పోస్టులు ఖాళీ అవుతాయి.  

డిపోలు, స్టేషన్లు పీపీపీకే!
ఇప్పటికే రూ.6,600కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. మిగిలిన డిపోలు, ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్‌ స్టేషన్లను కూడా 2031 నాటికి  దశలవారీగా పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది.

పక్కా ప్లాన్‌ ప్రకారమే..! 
ఆ విధంగా ఆర్టీసీలో 85శాతం బస్సులు ఉండవు... 65 శాతం మంది ఉద్యోగులు ఉండరూ. ఆర్టీసీకి ఆస్తులూ ఉండవు. ఈ నేపథ్యంలో ఇక ఆర్టీసీని నిర్వహించడం దంగడమారి వ్యవహారం అని ఓ కమిటీ ద్వారా తేల్చాలన్నది ప్రభుత్వ పన్నాగం. ఆ వెంటనే ఆర్టీసీని పూర్తిగా మూసివేసి రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల రోడ్డు రవాణా వ్యవస్థను పూర్తిస్థాయిలో తీసుకురావాలన్నది చంద్రబాబు ప్రభుత్వ కుట్ర. దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నాయి. అందుకోసం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆదివారం విజయవాడలో ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement