విచ్చలవిడిగా స్టెరాయిడ్ల వినియోగం
తప్పుదోవ పట్టిస్తున్న కొందరు జిమ్ యజమానులు
వేల రూపాయల డబ్బు పోసి రోగాలతో సావాసం
చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు
కర్నూలుకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఓ రోజు అద్దం ముందు నిలబడి సన్నని చేతులు, ఛాతీ చూసుకొని కుమిలిపోయాడు. కాలేజీలో కొందరు బైక్‌లు, బాడీ బిల్డింగ్, స్టైల్ అని తిరుగుతుంటే తాను మాత్రం ఇలా ఉన్నానేంటని బాధపడసాగాడు. ఎలాగైనా తనను తాను మార్చుకోవాలని జిమ్‌లో చేరిపోయాడు. మూడు నెలల పాటు కష్టపడినా పెద్దగా మార్పు కనిపించక తన జీవితం ఇంతేనని బాధపడ్డాడు. గమనించిన జిమ్ యజమాని ఊరికే జిమ్ చేస్తూ లాభం ఉండదని, సప్లిమెంట్స్(స్టెరాయిడ్స్) తప్పనిసరి అని నూరిపోశాడు. మరో మూడు నెలల్లో నిన్ను నువ్వు గుర్తు పట్టలేనంతగా మారిపోతావని నమ్మబలికాడు. ఇంకేముంది.. ఆయన చెప్పినట్లు చేయడంతో నెల రోజులకే స్పష్టమైన మార్పు వచ్చింది.
ఆ తర్వాతే ఏం జరిగిందంటే..
అనాబాలిక్ స్టెరాయిడ్స్, ఇంజెక్షన్లు వాడటంతో ఆ యువకుడి శరీరంలో అద్భుతవై ున మార్పులు చోటు చేసుకున్నాయి. కండలు ఉబ్బడంతో పాటు బరువులు సులువుగా ఎత్తేయగలిగాడు. సోషల్ మీడియాలో సిక్స్ ప్యాక్ ఫోటోలు పెట్టడమే ఆలస్యం.. వేలల్లో లైకులు, కామెంట్లు రావడం మొదలయ్యాయి. కానీ, ఈ తాత్కాలిక సంతోషం వెనుక పెద్ద ముప్పు పొంచి దాగుందని గమనించలేకపోయాడు. చిన్న విషయాలకే విపరీతంగా కోప్పడటం, ఇంట్లో తల్లిదండ్రులపై అరవడం మొదలుపెట్టాడు. ముఖం, వీపు పెద్ద పెద్ద మొటిమలతో నిండిపోయింది. రాత్రి పూట నిద్ర పట్టకపోవడంతో పాటు గుండె వేగం పెరగసాగింది.
చివరకు ఆసుపత్రిపాలు
ఓ రోజు ఉదయం జిమ్‌లో 150 కేజీల బరువును బెంచ్ ప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా గుండెల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. కళ్ల ముందు చీకట్లు కమ్ముకోగా.. ఊపిరి ఆడక భారీ బరువును మీద వేసుకున్నాడు. నోటి వెంట నురుగ కక్కుతూ అక్కడికక్కడే స్పహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ప్రమాదకరమైన హార్మోన్ ఇంజెక్షన్లు వాడినట్లుగా గుర్తించారు. తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పి చికిత్స చేయిడంతో త్వరలోనే కోలుకున్నాడు.
సోషల్ మీడియా యువతపై పెను ప్రభావం చూపుతోంది. కొందరు యువకులు వ్యాయామం చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తుండటంతో తాము కూడా అలా ఎందుకు కాకూడదనే భావన అధికమైంది. అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకోవడం, జిమ్‌లో చేరిపోవడం జరిగిపోతుంది. ఇతరుల కంటే ఆకర్షణీయంగా, ‘సిక్స్ ప్యాక్‘ బాడీతో కనిపించాలనే ఒత్తిడికి లోనవుతున్నారు. నెలలు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో కండలు పెరగకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు.
ఈ పరిస్థితిని కొందరు జిమ్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. స్టెరాయిడ్స్ దుష్ప్రభావాలపై సరైన అవగాహన లేకపోవడం, జిమ్ ట్రైనర్ల తప్పుడు సలహాలను నమ్మి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మోతాదుకు మించిన స్టెరాయిడ్స్ వాడకంతో శరీరం వీటికి అలవాటు పడిపోతోంది. మరింత మోతాదు కోరుకుంటోంది. ఫలితంగా శరీరంలోని సహజ హార్మోన్ల వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమవుతోంది. డ్రగ్స్ తరహాలో ఇవి కూడా వ్యసనంగా మారిపోతున్నాయి. ఆపేస్తే తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అధిక మోతాదుతో కాలేయం, కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు.
స్టెరాయిడ్స్ దుష్ప్రభావాలు
» చెడు కొలె్రస్టాల్ పెరిగి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశం.
» నోటి ద్వారా తీసుకునే స్టెరాయిడ్స్‌తో కాలేయంలో గడ్డలు, సిస్ట్‌లు ఏర్పడతాయి.
» టీనేజ్ వయసులో స్టెరాయిడ్స్ వాడకంతో ఎముకల ఎదుగుదల నిలిచిపోతుంది.
» ముఖం, శరీరంపై తీవ్రమైన మొటిమలు రావడంతో పాటు చర్మం జిడ్డుబారుతుంది.
» పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది.
» చిన్న వయసులోనే బట్టతలకు కారణమవుతుంది.
» స్త్రీలలో గొంతు బొంగురుపోతుంది. ముఖం, శరీరంపై అధికంగా జుట్టు పెరుగుతుంది. రుతుక్రమం తప్పడం లేదా పూర్తిగా నిలిచిపోతుంది.
» 2019–2021 మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని పలు జిమ్‌లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సందర్భంగా లక్షల విలువైన నిషేధిత స్టెరాయిడ్స్ స్వాదీనం చేసుకున్నారు.
» ఢిల్లీలో ఓ యువ బాడీబిల్డర్ స్టెరాయిడ్స్ ఓవర్ డోస్‌తో కిడ్నీలు ఫెయిలై చనిపోయాడు. ఆ కేసులో జిమ్ యజమానితో పాటు సప్లయర్లను నాన్–బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్ చేశారు.
» కర్ణాటకకు చెందిన జాతీయ స్థాయి బాడీబిల్డర్ సుశీల్‌కుమార్ 26 ఏళ్ల వయస్సులో ఈనెల 16న గుండెపోటుతో మరణించారు.
.. ఇవే కాదు, దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు 25 నుంచి 30 ఏళ్ల వయస్సులోనే హఠాత్తుగా మృత్యుఒడి చేరుతుండటం వెనుక ఈ స్టెరాయిడ్స్ కారణమేనని తెలుస్తోంది.
వేలల్లో డబ్బు..
» ఆండ్రాలిక్ లేదా డైనాబోల్ లాంటి టాబ్లెట్స్ బ్లాక్ మార్కెట్లో రూ.2వేల నుంచి రూ. 5వేల ధరతో విక్రయిస్తున్నారు.
» ట్రెన్‌బోలోన్ లేదా టెస్టోస్టెరాన్ ప్రొపియోనేట్ ఇంజెక్షన్ల ధర ఒక్కో వయల్‌కు రూ.4వేల నుంచి రూ. 12వేలు వసూలు చేస్తున్నారు.
» ఒక మూడు నెలల సైకిల్ కోర్సు కంప్లీట్ చేయాలంటే కనీసం రూ.30వేల నుంచి రూ.50వేలు ఖర్చు చేయాలని కొందరు జిమ్ నిర్వాహకులు నమ్మబలుకుతున్నారు.
పోషకాహారంతోనే ఆరోగ్యం
» కండరాలు పెరగడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. కోడిగుడ్లు, చికెన్ బ్రెస్ట్, చేపలు, పాలు, పనీర్, సోయాబీన్, మొలకెత్తిన గింజలతో పాటు పప్పు ధాన్యాలలో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది.
» వ్యాయామం చేయడానికి శరీరానికి శక్తి అవసరం. అందుకోసం బ్రౌన్ రైస్, ఓట్స్, చిలగడదుంపలతో పాటు తృణధాన్యాలు తీసుకోవాలి.
» హార్మోన్ల సమతుల్యతకు బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌తో పాటు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.
» కండరాలలో 70 శాతం పైగా నీరు ఉంటుంది. కాబట్టి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి.
» వారంలో నాలుగైదు రోజులే వ్యాయామం చేయాలి.
» రోజు మార్చి రోజు వ్యాయామం చేయడం మరింత ఉత్తమం.
» బరువులను, వ్యాయామం చేసే సమయాన్ని కొద్దికొద్దిగా పెంచుతూ ఉండాలి.
» ప్రతిరోజు రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటల గాఢనిద్ర తప్పనిసరి.
షార్ట్‌కట్స్ ఎంచుకోవద్దు
కండరాలు పెంచుకునేందుకు షార్ట్‌కట్ మార్గాలను ఎంచుకోవద్దు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు లేదా స్నేహితులు ఇచ్చే నిర్ధారణ లేని సలహాలను గుడ్డిగా నమ్మవద్దు. సరైన వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత నిద్రతో పాటు క్రమశిక్షణ పాటించాలి. 30 రోజుల్లో సిక్స్‌ప్యాక్, వెంటనే మజిల్ గెయిన్ వంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – గూడపాకం భరత్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్ కోచ్
కండరాలు పెరిగే వయస్సు
15 – 20 సంవత్సరాలు:
ఈ వయస్సులో శరీరంలో టెస్టోస్టెరాన్ మరియు గ్రోత్ హార్మోన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ సమయంలో ఎముకల ఎదుగుదల ఇంకా జరుగుతుంటుంది. కాబట్టి, చాలా బరువైన వెయిట్స్ ఎత్తడం కంటే బాడీవైట్ వ్యాయామాలు (పుష్–అప్స్, పుల్–అప్స్) చేయడం సురక్షితం.
20 – 30 సంవత్సరాలు:
ఇది కండరాల నిర్మాణానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ వయస్సులో హార్మోన్ల స్థాయిలు గరిష్టంగా ఉంటాయి. శరీరం వ్యాయామం నుంచి చాలా వేగంగా కోలుకుంటుంది. ఈ దశలో సరైన డైట్, వెయిట్ ట్రైనింగ్‌తో అద్భుతమైన కండరాలను సాధించవచ్చు.
30 నుంచి 40 సంవత్సరాలు:
30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు సంవత్సరానికి సుమారు 1% చొప్పున నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తాయి. సరైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన వ్యాయామంతో 35–40 ఏళ్ల వయస్సు వరకు కూడా కండరాల పరిమాణాన్ని పెంచుకోవచ్చు.
40 సంవత్సరాల తర్వాత:
40 దాటిన తర్వాత కండరాలను కొత్తగా పెద్ద మొత్తంలో పెంచడం కొంచెం కష్టమవుతుంది, కానీ సాధ్యమే. ఈ వయస్సులో వ్యాయామం ముఖ్య ఉద్దేశం ఉన్న కండరాలను కాపాడుకోవడం, బలాన్ని పెంచుకోవడం చేయవచ్చు.
అమెరికాలో జరిగిన ఓ సైంటిఫిక్ సర్వే ప్రకారం
స్టెరాయిడ్స్ వినియోగం ఇలా..
913 సంవత్సరాల్లోపు: 2.7 శాతం
1217 సంవత్సరాల్లోపు: 4.7 శాతం
17 సంవత్సరాలు: 6.6 శాతం
కాంపిటీటివ్ బాడీ బిల్డర్స్: 54 శాతం
ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్: 90 శాతం
ఎలాంటి శిక్షలు ఉంటాయి..
» డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద కేసు నమోదు చేస్తారు.
» డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, సరైన లైసెన్స్ లేకుండా షెడ్యూల్డ్ డ్రగ్స్ విక్రయించడం నేరం.
» కనీసం 3 నుంచి 5 సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు.
» ఒకవేళ బాధితుడు చనిపోతే హత్య కేసు నమోదువుతుంది.
– సాక్షి, కర్నూలు డెస్క్


