ఏపీ: రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

President Kovind Approves Two APs Bills - Sakshi

ఏపీ ఎస్సీ కమిషన్‌కు లైన్‌ క్లియర్‌

విద్యుత్‌ సవరణ బిల్లుకు కూడా..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదముద్ర వేశారు. ఒకటి ఎస్సీ కమిషన్‌ ఏర్పాటు బిల్లు అయితే మరొకటి విద్యుత్‌ సుంకం (సవరణ) బిల్లు. వివరాలివీ.. ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కమిషన్‌ ఏర్పాటుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ వేర్వేరు కమిషన్లను ఏర్పాటుచేస్తూ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ సభ్యులు వెనక్కి పంపించారు. దీంతో గతేడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరోమారు బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టి ఆమోదించింది.

అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించడంతో గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వీకే పట్నాయక్‌ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులకు పంపిన అధికారిక సమాచారం గురువారం చేరింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌ను సీఎం నెరవేర్చినట్లయింది. ఇప్పటివరకు ఒకే కమిషన్‌ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయడంవల్ల అవి మరింత సమర్థవంతంగా పనిచేసే వీలు కలుగుతుంది.

ఏపీ విద్యుత్‌ సుంకం సవరణ బిల్లుకూ..
ఇక రెండోదైన ఏపీ విద్యుత్‌ సుంకం (సవరణ) బిల్లు–2020కు కూడా రాష్ట్రపతి ఆమోదం లభించింది. గతేడాది డిసెంబర్‌ 2న ఈ బిల్లును విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దశాబ్దాల క్రితం నిర్ణయించిన విద్యుత్‌ సుంకంతో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు చట్టంలో స్వల్ప మార్పుచేసి అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఈ బిల్లు రూపొందించారు. దీంతో ఇక రాష్ట్రంలో వేర్వేరు కేటగిరీల వినియోగదారులకు, వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా విద్యుత్‌ సుంకం విధిస్తారు.

నష్టాలు తగ్గించి..  నాణ్యమైన విద్యుత్‌ 
సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని రైతులకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. అదే విధంగా పదివేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ప్రజలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సుంకం (సవరణ) బిల్లు–2020ను తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవసరానికి మించి విద్యుత్‌కు రేటు చెల్లించారు. కేవలం రెండు, మూడు రూపాయలకే యూనిట్‌ విద్యుత్‌ను ఇస్తామని అమ్మకందారులు ముందుకొచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రూ.4.80 చెల్లించి టీడీపీ పాలకులు కొనుగోలు చేశారు. తద్వారా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు. దీని నుంచి బయటపడటానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది. ఇప్పటివరకు యూనిట్‌కు 6పైసల చొప్పున సుంకం విధిస్తున్నారు. ఈ బిల్లుతో కేటగిరీల బట్టి, విద్యుత్‌ వాడే సమయాలను బట్టి సుంకం విధిస్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top