President Election 2022: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా..

President Election 2022: YSRCP Strength In President Election Poll - Sakshi

ఏపీలో మొత్తం 36 మంది ఎంపీల ఓటు విలువ 25,488

అలాగే, 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825

రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 53,313

ఇందులో వైఎస్సార్‌సీపీ వాటా 45,957

సాక్షి, అమరావతి: భారతదేశంలో అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి ఎన్నిక అంటే ఓటింగ్‌పైనే అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉండడంతో పాటు పార్లమెంటు సభ్యులు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉండడం గమనార్హం. పైగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకునే రాష్ట్రపతి ఎన్నికలు త్వరలో జరగనున్నందున అందులో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
చదవండి: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇందులో 151 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు, 23 మంది టీడీపీకి చెందినవారు కాగా, ఒకరు జనసేనకు చెందిన వారు. ఇక ఎంపీల విషయానికొస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, ఇందులో 22 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ముగ్గురు టీడీపీకి చెందిన ఎంపీలున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా ఇందులో వైస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నిక ఇలా..
దేశాధ్యక్షుడి ఎన్నిక ఇతర సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలకు కూడా ఓటు ఉంటుంది. ఒక ఎంపీ ఓటు విలువను మొత్తం ఎన్నికైన రాష్ట్ర ఎమ్మెల్యేలు/ఎన్నికైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. ఏపీలో 36 మంది ఎంపీలు (లోక్‌సభ+రాజ్యసభ) ఉండగా వారి మొత్తం ఓటు విలువ 25,488గా ఉంది. ఎమ్మెల్యే ఓటు విలువను రాష్ట్జ జనాభా/మొత్తం ఎమ్మెల్యేలు 1000గా (జనాభాను 1971 లెక్కల ప్రాతిపదికగా తీసుకున్నారు) లెక్కిస్తారు. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్ల విలువ 27,825గా ఉంది. అంటే రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ 53,313గా ఉంది. ఇక జమ్మూ అండ్‌ కశ్మీర్‌ అసెంబ్లీని రద్దుచేయడంతో ఆ మేరకు ఎంపీ ఓటు విలువ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 708 నుంచి 700కు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రధాన పాత్ర వైఎస్సార్‌సీపీదే..
ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధికంగా ఓటు వేసేది అధికార వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే. ఈ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులు 22 మంది, రాజ్యసభలో మరో 9 మంది ఎంపీలకు కలిపి మొత్తం ఓటు విలువ 21,948 కాగా, 151 మంది ఎమ్మెల్యేలకు 24,009 ఓటు విలువ ఉంది. అంటే రాష్ట్రం నుంచి ఉన్న మొత్తం 53,313 ఓటు విలువలో వైఎస్సార్‌సీపీ 45,957 ఓటు విలువ పంచుకోనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top