స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి వడివడిగా అడుగులు | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి వడివడిగా అడుగులు

Published Sun, Jan 8 2023 1:41 PM

Preparations For Bhoomi Puja Of YSR Steel Plant - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సంకల్పించారు. నిరుద్యోగం పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే ఆశయంతో సొంత జిల్లాలో  స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నాలుగులేన్లు రోడ్డు, ట్రైన్‌ కనెక్టివిటీ, నీటి వసతి, విద్యుత్‌ సరఫరా పనులు వేగవంతం అయ్యాయి. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం శరవేగంగా స్పందిస్తోంది. వైఎస్సార్‌ స్టీల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ భూమిపూజకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.   

పట్టించుకోని టీడీపీ.. 
వెనుకబాటుకు గురైన రాయలసీమ నడిబొడ్డున కడప గడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపరిచారు. తద్వారా నిరుద్యోగులకు మెరుగైన జీవనం లభిస్తోందని అనుబంధ పరిశ్రమలు ద్వారా మరింత ఉపాధి లభిస్తుందని తలిచారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. తీరా ఎన్నికలకు ముందు 2018లో ఓ పునాది రాయితో చంద్రబాబు సర్కార్‌ సరిపెట్టింది. 

బాధ్యతగా వైఎస్‌ఆర్‌సీపీ.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్‌ ఫ్లాంట్‌ నిర్మించాలనే ఆశయాన్ని భుజానికెత్తుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌ 23న స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట నిర్వహణకు సన్నహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. మానవుల జీవనం అస్తవ్యస్తంగా తయారయింది.   రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ రావడంతో ప్లాంట్‌  నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. 

జేఎస్‌డబ్లు్య స్టీల్స్‌ లిమిటెడ్‌కు భూమి అప్పగింత
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల చేపట్టిన జిల్లా పర్యటనలో జేఎస్‌డబ్లు్య స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా జమ్మలమడుగు సమీపంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఈనెలలో భూమి పూజ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కాగా జీఓ ఎంఎస్‌ నంబర్‌ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేశారు.  

∙ఈ స్టీల్‌ ప్లాంట్‌ తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్‌ టన్నులు (10 లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం కానుంది. అందుకోసం ఫేజ్‌–1లో రూ.3,300 కోట్లు వెచ్చించనున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నారు. 36 నెలల కాలపరిమితిలో ఫేజ్‌–1 పనులు పూర్తి  కానున్నాయి. తొలివిడతలో వైర్‌ రాడ్స్‌ మరియు బార్‌ మిల్స్‌ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5.500 కోట్లుతో ఫేజ్‌–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్‌–2 సైతం 2029 మార్చి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.  

మౌలిక వసతుల కల్పన
స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం  ప్రభుత్వం రూ.713 కోట్లు వెచ్చిస్తోంది. నాలుగులైన్లు రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్‌ ఏర్పాటు, నిల్వ చేసుకునేందుకు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు, విద్యుత్‌ సరఫరా, కాంపౌండ్‌ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులోభాగంగా ఎన్‌హెచ్‌–67 నుంచి ముద్దనూరు టు జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్లతో 12 కిలోమీటర్లు నాలుగు లైన్లు రహదారి నిర్మించనున్నారు.   

యర్రగుంట్ల టు ప్రొద్దుటూరు రైల్వేలైన్‌ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్‌ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తయ్యాయి.  

రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి అయింది. 20 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన సంప్‌ నిర్మాణం ఫినిషింగ్‌ దశలో ఉంది. చుట్టూ ప్రహరీ, భవన సముదాయం వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. ఇంటర్నల్‌ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌ స్టీల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ భూమిపూజ నాటికి కావాల్సిన మౌలిక వసతుల కోసం వడివడిగా పనులు చేస్తుండడం విశేషం. కాగా అధికారికంగా సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు కావాల్సి ఉంది.   

Advertisement
 
Advertisement