పీఆర్‌సీ ప్రక్రియ నెలాఖరుకు పూర్తి

PRC process is complete by the end of the month - Sakshi

సాక్షి,అమరావతి: అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి 11వ పీఆర్‌సీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హామీ లభించిందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల హెల్త్‌ కార్డులు పొడిగించేందుకు అంగీకరించారని, సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని సీఎంవో నుంచి హామీ లభించిందని తెలిపారు. జేఏసీల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.

ఉద్యోగుల సంక్షేమం కోసమే రెండు జేఏసీలు కృషి చేస్తాయని, సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ, ఫిట్‌మెంట్‌ సాధన కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సీఎం అదనపు కార్యదర్శి కె.ధనంజయరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సీఎంవోలో ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చించి తాము ఇచ్చిన వినతి పత్రంలోని అంశాలను పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగుల సహకారం మరువలేనిదని, కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తామని చెప్పారన్నారు. 

18, 19న సీఎస్‌తో భేటీ!
సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు తదితర అంశాలను ప్రస్తావించినట్లు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో సమావేశం ఏర్పాటు చేసి హెల్త్‌ కార్డు ద్వారా ఉత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

45 రోజుల్లోనే కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరగా సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఈ నెల 17, 18వ తేదీలలో జరుగుతుందన్నారు. పీఆర్సీపై ఈ నెల 18, 19వ తేదీల్లో ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ సమావేశాన్ని నిర్వహించి చర్చించే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు జి.హృదయరాజు, వైవీ రావు, కేవీ శివారెడ్డి, జీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top