ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ!

Prakasam District Ranks Second In Employment Guarantee Works - Sakshi

ఉపాధి హామీ పనుల్లో జిల్లాకు రెండోస్థానం

ఏడాది లక్ష్యాన్ని ఐదు నెలల్లో అధిగమించిన వైనం

కరోనా సమయంలోనూ కూలీల చేతుల్లో పుష్కలంగా డబ్బు

పనిదినాల లక్ష్యం 1.95 కోట్లు

ఆగస్టు 24 నాటికే 1.97 కోట్ల పనిదినాలు పూర్తి

కూలీలకు రూ.484 కోట్ల చెల్లింపు

4.51 లక్షల కుటుంబాల్లో 7.65 లక్షల మందికి ఉపాధి 

ప్రభుత్వం, అధికారుల ముందుచూపు ఫలించింది. కరోనా కష్టకాలంలోనూ ఉపాధి హామీ పథకం కింద చేతినిండా పని కల్పించడంతో పేదలకు భరోసా లభించింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు కిందిస్థాయి సిబ్బందితో సమీక్షలు నిర్వహించి కూలీలకు అత్యధిక  పనిదినాలు కల్పించారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టి లక్ష్యాన్ని అధిగమించారు. రాష్ట్రంలో జిల్లాను రెండో స్థానంలో నిలిపారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్లుగా కరోనా పట్టిపీడిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ప్రతి ఇంటికి చేదోడు వాదోడుగా నిలిచింది. చేతి నిండా పని కల్పించి.. కడుపు నింపింది. జిల్లాలో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. పల్లెల్లో వేకువజామునే లేచి తెలతెలవారే సమయంలో వందల సంఖ్యలో కూలీలు పనుల బాట పట్టడమంటే పండుగే మరి.

ఐదు నెలల్లోనే లక్ష్యానికి మించి... 
పేదలకు ఉపాధి కల్పించటడంలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఇచ్చిన లక్ష్యాలను అధిగమించింది. ఈ ఏడాదికి 1.95 కోట్ల పనిదినాలు కూలీలకు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదు నెలల్లోనే లక్ష్యాన్ని దాటేసి 1.97 కోట్ల పనిదినాలు కల్పించారు. రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలు కల్పించిన విజయనగరం జిల్లా తర్వాత ప్రకాశం రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 6.40 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులను జిల్లా యంత్రాంగం కల్పించింది. ఇప్పటి వరకు మొత్తం వేతనాల రూపంలో రూ. 484 కోట్లు కూలీలకు చెల్లించారు. ఈ పథకం ద్వారా 4.51 లక్షల కుటుంబాల్లోని దాదాపు 7.65 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లయింది. 

అత్యధికంగా యర్రగొండపాలెం మండలంలో... 
జిల్లాలో ఉపాధి పనులు అత్యధికంగా యర్రగొండపాలెం మండలంలో జరిగాయి. ఈ ఒక్క మండలంలోనే ఈ సంవత్సరంలో కూలీలకు 7,60,279 పనిదినాలు కల్పించారు. యర్రగొండపాలెం మండలం తర్వాతి స్థానంలో పెద్దారవీడు మండలంలో 6,60,093 పనిదినాలు, బేస్తవారిపేట 6,36,217, కొనకనమిట్ల 5,86,579, మార్టూరు 5,84,959, మర్రిపూడి 5,68,653, దోర్నాల 5,67,703, పొన్నలూరు 5,24,938, కొండపి 5,23,484, దర్శి మండలంలో 5,21,033 పనిదినాలు కల్పించారు.

మా కుటుంబానికి ఉపాధి పని ఊరటనిచ్చింది 
కరోనా సమయంలో పనులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడ్డాం. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం ద్వారా నేను, నా భర్త కలిసి 136 రోజులు పని చేశాం. రోజుకు రూ.145 చొప్పున మొత్తం రూ.19,720 మా బ్యాంకు ఖాతాలో జమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దయవల్ల అమ్మ ఒడి పథకం ద్వారా రూ.14 వేలు, ఆసరా ద్వారా రూ.18,500 నా ఖాతాలో జమయ్యాయి. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతుకుతున్నాం. 
– మమ్ము రమణ, ఉపాధి హామీ కూలీ, యర్రగొండపాలెం 

కరోనా సమయంలోనూ ఉపాధి 
కరోనా మహమ్మారి ఒక పక్క వేధిస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా చూశాం. ఇతర పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా చేతినిండా పని కల్పించాం. ఒక్కో కూలీ అకౌంట్‌లో వారానికి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు కూలి డబ్బు పడింది. వేలాది కుటుంబాల్లో 100 రోజుల చొప్పున కూడా ఉపాధి కల్పించాం. దీంతో కూలీలకు ఉపాధి దొరకడమే కాకుండా, గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా వేగం పుంజుకున్నాయి. 
– కె.శీనారెడ్డి, డ్వామా పీడీ  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top