
పెద్దలు నిరాకరించడంతో చెట్టుకు ఉరివేసుకున్న వైనం
కొమరోలు/ప్యాపిలి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామ సమీప రేగలగడ్డ చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కట్టెల భారతికి(20)మూడేళ్ల క్రితం అలేబాదు గ్రామానికి చెందిన శివప్రసాద్‌తో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఏడాదిగా భారతి స్వగ్రామంలో ఉంటోంది.
ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(26)తో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం పెద్దలకు తెలియడంతో వారు హెచ్చరించారు. దీంతో ఇరువురూ ఈ నెల 4న ఇంటి నుంచి పారిపోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపించి ఫోన్ స్విచాఫ్ చేశాడు. స్థానిక ఎస్సై నాగరాజు ఆదివారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి లొకేషన్ ఆధారంగా అక్కపల్లె గ్రామానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గాలించగా భారతి, రాముడు చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.