
జేబు నింపుకోవడమే లక్ష్యంగా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చౌదరి బరితెగింపు
ఒక్కో పనికి ఒక్కో రేటు.. ల్యాండ్ కన్వర్షన్‌కు భూ విలువలో పర్సంటేజ్
వెంచర్ అనుమతికి 8–10 ప్లాట్లు ఇవ్వాల్సిందే
నియోజకవర్గంలో తార స్థాయికి చేరిన అక్రమాలు
విస్తుబోతున్న స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు
అక్రమాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు, దాడులు
సాక్షి టాస్క్ ఫోర్స్ : ‘ఎవడైతే నాకేంటీ (టీడీపీ, జనసేన).. నా నియోజకవర్గంలో నేను చెప్పిందే జరగాలి.. నా అడ్డాలోకి ఎవడూ రాకూడదు.. కాదని ఎవడైనా అడ్డొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు..’ అన్నట్లుంది గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చౌదరి వ్యవహార శైలి. ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి ఇలా బరితెగించి వసూలు చేయడం ఇదివరకెన్నడూ చూడలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన చేస్తున్న అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
ఎమ్మెల్యే అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలతో స్థిరాస్తి వ్యాపారులు, ఇటు అధికారులతో పాటు టీడీపీ నాయకులు సైతం విసిగిపోతున్నారు. అతని అక్రమాలకు ఎవరైనా ఎదురువెళ్తే వారిపై అక్రమ కేసులు పెట్టించడం, పోలీసులను ఉపయోగించి బెదిరించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. లేదంటే న్యాయవాదులను రంగంలోకి దింపి వారిపై ప్రైవేటు కేసులు వేయిస్తున్నారు. ఇంకా మాట వినకపోతే తమ వర్గం వారితో దాడులకు తెగబడటం నైజం. ఇటీవల పొన్నూరు మండలం మన్నవ గ్రామానికి చెందిన బొనిగల నాగమల్లేశ్వరరావుపై ఎమ్మెల్యే అనుచరులు హత్యాయత్నానికి తెగబడిన సంగతి తెలిసిందే.
తాజాగా మంగళవారం పెదకాకాని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేయించడం దీనికి పరాకాష్ట. మున్ముందు తనకు టికెట్ ఉండదన్న సందేహాలు, నియోజకవర్గ విభజనలో పొన్నూరు ఎస్సీలకు కేటాయించే అవకాశాలు ఉన్నందున తనకు ఇదే చివరి అవకాశంగా భావించారో ఏమో.. అన్ని వర్గాల వారిని, నేతలందరినీ కట్టడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు.
వరుస ఫిర్యాదులు
పొన్నూరులో జరుగుతున్న అక్రమాలపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో టీడీపీ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇటీవల పెదకాకాని మండలంలో జరిగిన మేజిస్ట్రేట్ వ్యవహారంలో జోక్యం, చేబ్రోలు మండలంలో సుమారు 10 ఎకరాల వెంచర్‌లో సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన వైనంపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామ పరిధిలో అర ఎకరం విస్తీర్ణంలో ఉన్న కల్యాణ మండపం యజమాని లోను కట్టక పోవడంతో దాన్ని బ్యాంకు అధికారులు వేలం వేశారు. దీన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్తకు చెందిన వారు దక్కించుకున్నారు.
అయితే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించకుండా పొన్నూరు ఎమ్మెల్యే అడ్డం పడ్డారని, రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తేవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమాచారం. ఇదే వ్యక్తులు చేబ్రోలు మండలంలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేసి, వెంచర్ వేసేందుకు ప్రయత్నించగా ధూళిపాళ్ల పేరు చెప్పి ఎకరానికి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు చినబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం తమ పార్టీకి చెందిన కార్యకర్తను బెదిరించి తక్కువ మొత్తానికి ఈ పొలాన్ని స్వా«దీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
అధికారుల బెంబేలు
» సార్‌కు డబ్బులతో పని లేదని అంటున్న పలువురు టీడీపీ నాయకులు.. ఎమ్మెల్యే ఎవరి వద్ద ఏం ఆశించరని ఇన్నాళ్లూ భావించిన వ్యాపారులు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఖంగుతింటున్నారు. ఆయన పీఏల ద్వారా ఆయన గారి కోర్కెలు విని వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. పొలం కన్వర్షన్ చేయాలంటే ఆ పొలం విలువలో పర్సెంటేజ్‌తో పాటు వెంచర్‌లో 8 నుంచి 10 ప్లాట్లు ఇవ్వాలని తేల్చి చెబుతున్నట్లు పలువురు బెంబేలెత్తుతున్నారు.
» ఇందుకు సై అన్న వారికి అనుమతులు కూడా అవసరం లేదని.. అధికారులు తనిఖీలకు వస్తే పీఏలే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్లోనే ఆదేశిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయమై ఓ అధికారిని సంప్రదించగా.. చెప్పుకుంటే తమ సిగ్గు పోతోందని, చాలా మంది అధికారులది ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిందే చేయాలని, లేదంటే సెలవుపై వెళ్లిపోవాలని అధికారులను ఇంటికి పిలిచి మరీ బెదిరిస్తున్నట్లు సమాచారం.

» రాజధానికి పక్కనే ఉన్న నియోజకవర్గం కావడంతో భూముల ధరలకు రెక్కలు రావడంతో గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారులు స్థానికంగా భూములు కొనుగోలు చేసి రియల్ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. పచ్చల తాడిపర్రు గ్రామ ప్రధాన రహదారిలో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో ఓ లేఅవుట్ సిద్ధమవుతోంది. ఆ వెంచర్‌లో కూడా 8 ప్లాట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వెంచర్‌లో అనుమతులను ఏ అధికారీ పరిశీలించిన దాఖలాలు లేవు.
» తీరా ఎవరైనా వెళితే నిమిషంలోనే ఎమ్మెల్యే పీఏ నుంచి ఫోన్ రావడంతో కిమ్మనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన అధికారులు అనేక మంది ఉన్నారు. చెరువుల అభివృద్ధి పేరుతో తవి్వన మట్టిని పెద్ద పెద్ద లారీల ద్వారా వేల టన్నులను ఆ వెంచర్‌కే విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మట్టి విక్రయాలన్నీ ఆయన సామాజిక వర్గ నేతలతోనే చేయిస్తున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
» చాలా సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే చెప్పే వరకు కేసు నమోదు చేయడం లేదని పోలీసులపై ఫిర్యాదులు పెరిగిపోయాయి. బాధితుల గోడు అసలు వినడం లేదని, న్యాయం జరిగే అవకాశాలే స్థానిక పోలీసు స్టేషన్లలో కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లలో ఫిర్యాదు వస్తే టీడీపీ నాయకులు వాలి పోతున్నారు. ఎమ్మెల్యే సార్ చెప్పారని.. తాము చెప్పినట్లు కేసు నమోదు చేయాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడ పని చేయడం చాలా కష్టంగా ఉందని పోలీసులు సైతం తల పట్టుకుంటున్నారు.