వేట.. పేలుతున్న తూటా

Police Warned Wildlife Animals Hunted People Will Be Imprisonment Imminent - Sakshi

నల్లమలలో నేలకొరుగుతున్న వన్య ప్రాణులు 

యథేచ్ఛగా సాగుతున్న జింక మాంసం విక్రయాలు 

నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న అటవీ అధికారులు

రుద్రవరం: అధికారుల కన్నుకప్పి కొందరు నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట సాగిస్తున్నారు. వన్యప్రాణుల మాంసానికి, చర్మానికి మంచి డిమాండు ఉండటంతో రహస్యంగా వేట కొనసాగిస్తున్నారు. కొందరు నాటు తుపాకులతో వేటాడుతుండగా, ఇంకొందరు ఉచ్చులు బిగించి వాటిలో చిక్కిన వన్యప్రాణులను హతమార్చి.. వాటి మాంసాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం, చెలిమ రేంజి పరిధిల్లో ఈ తతంగం సాగుతోంది.  

నేల రాలుతున్న జింకలు 
నంద్యాల డివిజన్‌లో రుద్రవరం, చెలిమ రేంజిలలో వేలాది హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లోని పలు గ్రామాలు అటవీ ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఆయా గ్రామాల వారంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మరక్షణ నిమిత్తం కొందరు నాటు తుపాకులు, వేట కొడవళ్లు  కలిగి ఉన్నారు. కాలక్రమేణా వాటిని జంతువులను వేటాడేందుకు వినియోగిస్తున్నారు. వీరు ఆయుధాలతో రహస్యంగా అడివిలోకి వెళ్లి వన్య ప్రాణులను ప్రధానంగా జింకలను హతమార్చుతున్నారు.  మాంసాన్ని బయటకు తరలించి కిలో రూ.500 ప్రకారం విక్రయిస్తున్నా రని సమాచారం. 

నామమాత్రపు దాడులు 
వేటగాళ్ల చేతుల్లో జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే నామమాత్రపు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రుద్రవరం మండలం హరినగరం వద్ద బహిరంగంగా వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడిచేసి నిందితులను వదిలిపెట్టి కేవలం మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఆపై అగ్నిలో కాల్చివేశారు. అదే గ్రామంలో ఓ నాటు తుపాకీ కూడా లభించింది. అయినప్పటికీ నిందితుడికి సరైన శిక్ష వేయించలేక పోయారు. అటవీ ప్రాంతంలో మరో నాటు తుపాకీ దొరికినట్లు చూపించారు. అలాగే ఇటీవలే గోస్పాడు మండలం దీబగుంట్ల వద్ద ఇరువురు నిందితులు జింక మాంసంతో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు మెట్ట ఆల్ఫా కళాశాల సమీపంలో జింకను వేటాడినట్లు చెప్పారు.

కొరవడిన సంరక్షణ 
వన్య ప్రాణులు అటవీ ప్రాంతంలో జీవించలేక బయటకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా రుద్రవరం మండలంలోని ఆర్‌.నాగులవరం, చందలూరు, తువ్వపల్లె, టీ.లింగందిన్నె, పేరూరు, శ్రీరంగాపురం, పెద్దకంబలూరు, అప్పనపల్లె, ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె, నల్లగట్ల, కందుకూరు, చింతకొమ్మదిన్నె, మిట్టపల్లె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, బోదనం తదితర ప్రాంతాలలో జింకల సంచారం అధికంగా ఉంటోంది. అటువంటి ప్రదేశాల్లో అధికారుల నిఘా కొరవడటంతో వేట యథేచ్ఛగా సాగుతోంది. మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు వద్ద తెలుగు గంగ 28వ బ్లాక్‌ ఉప ప్రధాన కాల్వలో ఒకే ప్రదేశంలో వరుసగా రెండు పెద్ద పులులు మృతి చెందాయి. వాటి మృతికి కారణాలు ఇంత వరకు కనుగొన లేకపోయారు. మిట్టపల్లె, నల్లగట్ల ప్రాంతాల్లో  జింకల కళేబరాలు లభించాయి. ఇలా విచ్చలవిడిగా వేట సాగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వన్య ప్రాణులు, అడవి జంతువుల సంరక్షణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 

అందుబాటులో ఉండని సిబ్బంది 
నల్లమల అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తామని బాధ్యతలు చేపట్టిన అటవీ అధికారులు అడవికి 20, 40 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లగడ్డ, నంద్యాల వంటి పట్టణాల్లో నివాసాలు ఉంటున్నారు. పగటిపూట మాత్రం కార్యాలయాలు, ఠాణాల వద్ద అటుఇటు కలియతిరిగి వెళ్తున్నారు. రాత్రి సమయాల్లో అటవీ సంరక్షణ గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

వన్యప్రాణులను వేటాడితే జైలే
వేట కారణంగా నేలకొరుగుతున్న వన్య ప్రాణులపై రుద్రవరం రేంజి అధికారి శ్రీపతి నాయుడును వివరణ కోరగా వన్య ప్రాణులను వేటాడితే జైలుశిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలతో అటవీ శాఖ అప్రమత్త మయ్యిందన్నారు. ఇందులో భాగంగానే నల్లమల అటవీ ప్రాంతంలో రహస్యంగా ట్రాప్‌ కెమెరాలు అమర్చామన్నారు. అలాగే వేట సాగే పలు ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అలాగే గ్రామాల్లో వన్య ప్రాణులను వేటాడితే కేసులు, పడే శిక్షలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫారెస్టు గదులు సక్రమంగా లేకçపోవడం వల్లే సమీప పట్టణాల్లో సిబ్బంది నివాసముంటున్నారని తెలిపారు.
-శ్రీపతి నాయుడు, రుద్రవరం రేంజి అధికారి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top