సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్
సీరియస్‌గా తీసుకున్న అనంతపురం ఎస్పీ
ముఠాసభ్యులపై కేసు నమోదు
వీఆర్‌కు రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్
పలువురు హెచ్‌సీలు, పీసీలపై వేటుకు రంగం సిద్ధం
‘సాక్షి’ వరుస కథనాలతో ముఠా గుట్టురట్టు
రాప్తాడు రూరల్: అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ‘నయా హనీట్రాప్’ దందాపై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులతో పాటు వారికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో ఇంతకు ముందు ఎప్పుడూ లేనివిధంగా జరుగుతున్న ఈ దందా వ్యవహారంపై ‘సాక్షి’ పత్రిక.. ‘కవ్విస్తారు.. కాటేస్తారు!’, ‘అమాయకులే టార్గెట్’. ‘హనీ దందా ఖాకీ అండ!’ శీర్షికలతో ప్రత్యేక కథనాలను వెలుగులోకి తేవడంతో ఈ దందాపై ఎస్పీ జగదీష్ కొరడా ఝళిపించారు.
కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. రాప్తాడు సీఐ శ్రీహర్షకు హనీ ముఠా సభ్యులతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదులో అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరిద్దరినీ వీఆర్‌కు పంపుతూ బుధవారం డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకా కొందరు పోలీసులు ముఠా సభ్యులతో సన్నిహితంగా ఉండడంతోపాటు బాధితులను బెదిరించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. దాదాపు 10 మంది పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ముఠాలీడరుగా వ్యవ హరించిన రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఎస్పీపై భరోసాతో బాధితులు పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.
కవ్వించి.. కాటేస్తారు
ముఠా లీడర్లు.. సమాజంలో గౌరవంగా జీవిస్తున్న వ్యక్తుల కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తారు. తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్‌లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు. తర్వాత ఇంటికి పిలుస్తారు. ఏకాంత సమయంలో ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని న్యూడ్‌గా ఉండేలా చేస్తారు. ఆయన ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అక్కడితో ఆగకుండా కథకు కొత్త మలుపు ఇస్తారు.
‘భర్త, తమ్ముడు, అక్క, బావ, చెల్లెలు, పక్కింటి వాళ్లు’ పాత్రల్లో ముఠా సభ్యులు ఒక్కసారిగా వచ్చి గొడవ సృష్టిస్తారు. అప్పటికే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ మేరకు ‘నా భార్య వద్దకు ఎలా వస్తావు’ అంటూ భర్త పాత్రధారుడు.. ‘నా చెల్లెలు జీవితం నాశనం చేశావు’ అంటూ అన్న పాత్రధారుడు, ‘మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశా వు’ అంటూ పక్కింటి పాత్రధారులు ఎవరి డ్రామా వారు ప్లే చేస్తారు.
ఆ తర్వాత ‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు మొదలవుతాయి. దీంతో బాధి తులు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఇదే అదనుగా బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో అనేకమంది బయట పడకుండా రూ.లక్షలు చెల్లించినట్లు సమాచారం.
బాధితులూ ఫిర్యాదు చేయండి
సమాజంలో ఆర్థికంగా, గౌరవంగా బతుకుతున్న వారిని లక్ష్యం చేసుకుని హనీట్రాప్‌తో కొందరు దోపిడీ చేశారు. మహిళలు మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించుకుని న్యూడ్‌గా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయి. కేసులు నమోదు చేశాం. బాధితులెవరైనా ఉంటే అనంతపురం రూరల్ పీఎస్, డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు చేయండి. – టి.శ్రీనివాసులు, అనంతపురం రూరల్ డీఎస్పీ


