విశాఖదే వికాసం | PM Narendra Modi Comments On Visakhapatnam In AP Tour | Sakshi
Sakshi News home page

విశాఖదే వికాసం

Nov 13 2022 3:26 AM | Updated on Nov 13 2022 8:15 AM

PM Narendra Modi Comments On Visakhapatnam In AP Tour - Sakshi

విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

అటు సముద్రం... ఇటు జన సముద్రం! 
సాగర కెరటాలతో పోటీపడి విశాఖలో ఉప్పొంగిన జన వాహిని!  కడలి కదిలి వచ్చినట్లుగా ఏయూ ప్రాంగణం కిక్కిరిసింది. విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభ అంచనాలకు మించి విజయవంతమైంది. సభా ప్రాంగణంలో మూడు లక్షల మందికి ఏర్పాట్లు చేయగా   తెల్లవారుజాము నుంచే జన ప్రవాహం మొదలైంది. లోపల కిక్కిరిసి పోవడంతో భారీ సంఖ్యలో బయటే నిరీక్షించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినా ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో బాగా ఏర్పాట్లు చేసిందని, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే ఈ స్థాయిలో భారీ సభ గతంలో ఎన్నడూ జరగ లేదని, ఇక ముందూ సాధ్యం కాదని బీజేపీ నేతలు సైతం వ్యాఖ్యానించారు.

విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.  వేల ఏళ్ల క్రితమే ప్రపంచ దేశాలతో వర్తక, వాణిజ్య సంబంధాలను నెరపిన ఘన చరిత్ర ఇక్కడి ఓడరేవు సొంతమని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని పునరుద్ఘాటిస్తూ విభజన హామీలను నెరవేర్చాలని ప్రధానిని సీఎం జగన్‌ సభా వేదికగా మరోసారి కోరారు.  

‘‘అందరితో కలసి మెలసి స్నేహపూర్వకంగా, సుహృద్భావంతో మెలగడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నైజం. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో తమదంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ కీలకపాత్ర పోషిస్తోంది. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమ ఆసియా, రోమ్‌ నగరాలకు విశాఖ నుంచి ఎగుమతులు జరిగాయి. రక్షణ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో కీలకపాత్ర పోషిస్తూ విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ నగరంగా 
గుర్తింపు తెచ్చుకుంది’’
   
– ప్రధాని మోదీ 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా భారత్‌ మాత్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూస్తున్నాయన్నారు. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టిన ఏడు ప్రాజెక్టులు నగర అభివృద్ధితోపాటు ఆంధ్రప్రదేశ్‌ పురోగతికి దోహదం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా శనివారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలసి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. 

వాణిజ్యానికి కేంద్ర బిందువు.. 
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మూడు నెలల క్రితం ఏపీలో పర్యటించే అవకాశం నాకు లభించింది. విశాఖపట్నానికి చాలా విశిష్టమైన వర్తక, వ్యాపార సంప్రదాయాలున్నాయి. పురాతన భారతదేశంలో ముఖ్యమైన ఓడరేవుగా విలసిల్లింది. వేల సంవత్సరాల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌లకు వాణిజ్య మార్గంలో భాగంగా ఉంది. ఇప్పుడు కూడా దేశ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచింది. మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త కోణాలను ఆవిష్కరించడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సాధించేందుకు దోహదం చేస్తుంది. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అండగా ఉంటాం.  

ఏపీ తీరానికి కొత్త ఊపు.. 
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సమయంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోంది. సామాన్యుడి  అవసరాల ఆధారంగానే మౌలిక సదుపాయాల కల్పన రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తున్నాం. ప్రతిపాదిత ఎకనామిక్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లోని 6–వరుసల రహదారి, పోర్టు కనెక్టివిటీకి ప్రత్యేక రహదారి, విశాఖ రైల్వే స్టేషన్,  ఫిషింగ్‌ హార్బర్‌ల ఆధునికీకరణ లాంటి ప్రాజెక్టులు సమగ్ర అభివృద్ధి దృక్పథంలో భాగంగా చేపట్టినవే.

ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడమే కాకుండా ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా తగ్గించింది. మల్టీ మోడల్‌ రవాణా వ్యవస్థ ప్రతి నగరం భవిష్యత్తు అవసరాలను తీరుస్తుంది. విశాఖ ఈ దిశగా ఒక అడుగు వేసింది. ఈ అభివృద్ధి పరుగు పందెంలో ఏపీ, తీర ప్రాంతాలు కొత్త ఊపు, శక్తితో ముందుకు సాగుతాయి. 
విశాఖలో జరిగిన సభకు హాజరైన భారీ జనసందోహంలో ఓ భాగం 

పౌరుల ఆకాంక్షలను గుర్తిస్తూ.. 
ప్రపంచ దేశాలన్నీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ అభివృద్ధిలో భారత్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తించింది. భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది. పౌరుల ఆకాంక్షలు, అవసరాలను గుర్తిస్తూ పని చేస్తున్నందున ఇది సాధ్యమైంది. సామాన్యుల జీవితాన్ని మెరుగుపరిచేలా విధానాలను రూపొందిస్తూ ప్రతి నిర్ణయం తీసుకుంటున్నాం.

పీఎల్‌ఐ స్కీమ్, జీఎస్టీ, ఐబీసీ, జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌ ప్రాజెక్టులు దేశంలో పెట్టుబడులు పెరగడానికి కారణమయ్యాయి. అదే సమయంలో పేదల సంక్షేమం కోసం పథకాలను విస్తృతం చేస్తున్నాం. ఈ అభివృద్ధి ప్రయాణంలో అట్టడుగున ఉన్న ప్రాంతాలు కూడా భాగమయ్యాయి. గత రెండున్నరేళ్లుగా ఉచిత రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయడంతో పాటు ప్రతి రైతు ఖాతాలో ఏటా రూ.6 వేలు చొప్పున జమ చేస్తున్నాం.

డ్రోన్, గేమింగ్, స్టార్టప్‌ రంగాల్లో నిబంధనల సడలింపులతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. మత్స్యకారుల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల జారీతో పాటు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ చేపడుతున్నాం. నౌకాయాన రంగంలో రూ.వేల కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నాం. సముద్ర తీరం శతాబ్దాలుగా దేశాన్ని సుభిక్షంగా ఉంచుతోంది. మన సముద్ర తీరాలు దేశ శ్రేయస్సుకు  ముఖ ద్వారాలుగా పని చేశాయి.  

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
► దాదాపు రూ.450 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు ప్రధాని  శంకుస్థాపన చేశారు.  
► రూ.150 కోట్లతో చేపట్టనున్న విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ ప్రాజెక్టుతో హ్యాండ్లింగ్‌ సామర్థ్యం రోజుకు 150 టన్నుల నుంచి 300 టన్నులకు పెరగనుంది.  
► విశాఖ– రాయ్‌పూర్‌ 6 లైన్ల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.3,750 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణ దూరం 14 నుంచి 7 గంటలకు తగ్గడంతో పాటు ఏపీ, ఒడిశాలోని వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుంది.  
► విశాఖలోని కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలా నగర్‌ జంక్షన్‌ వరకు పోర్టు అవసరాల కోసం ప్రత్యేక రహదారికి, రూ.2,658 కోట్లతో గెయిల్‌ నిర్మిస్తున్న శ్రీకాకుళం–అంగుల్‌ పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. èరూ.211 కోట్లతో నిర్మించిన పాతపట్నం–నరసన్నపేట 2 లైన్ల రహదారి, రూ.2,917 కోట్లతో పూర్తి చేసిన ఓఎన్‌జీసీ యూ–ఫీల్డ్‌ అభివృద్ధి ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు.  

విశేష నగరం విశాఖ
శుక్రవారమే విశాఖ చేరుకుని ఐఎన్‌ఎస్‌ చోళా సూట్‌లో బస చేసిన ప్రధాని మోదీ ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గవర్నర్, సీఎం, రైల్వే మంత్రి ఆయనకు స్వాగతం పలికారు. వివిధ ప్రాజెక్టుల స్టాల్స్‌ను పరిశీలించాక సభా వేదికపైకి చేరుకున్నారు.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం జగన్‌ ప్రసంగించాక ప్రధాని మాట్లాడారు.

ఆయన ప్రసంగాన్ని ఎమ్మెల్సీ మాధవ్‌ తెలుగులో అనువదించారు.  సుమారు 25 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఏపీ ప్రజల మనస్తత్వాన్ని ప్రధాని మెచ్చుకోవడంతో పాటు విశాఖ నగరాన్ని విశేష నగరంగా అభివర్ణించారు.   అనంతరం ప్రధాని 11.56 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు.  

రాష్ట్రానికి వందే భారత్‌ రైలు!
త్వరలో ఏపీకి వందే భారత్‌ రైలును కేటాయిస్తాం. విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణతో ప్రపంచస్థాయి సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. సోలార్‌ ద్వారా రైల్వేల విద్యుత్‌ అవసరాలు తీర్చుకుంటున్నాం. వన్‌ స్టేషన్‌–వన్‌ ప్రొడక్ట్‌ ద్వారా విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏటికొప్పాక బొమ్మలను అందుబాటులో ఉంచాం. ప్రధాని మోదీ హయాంలో ఏపీకి కేంద్రం కేటాయిస్తున్న నిధులు పెరిగాయి. 2004కి ముందు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు రూ.886 కోట్లు కేటాయించగా ప్రధాని మోదీ ఏకంగా రూ.7,043 కోట్లు కేటాయించారు.  
– అశ్విని వైష్ణవ్, రైల్వేశాఖ మంత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement