
కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల రిలే దీక్షలు
లబ్బీపేట/పటమట (విజయవాడ తూర్పు): తమ సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పందించి.. స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. తమ డిమాండ్ల పరిష్కారానికి మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీహెచ్‌సీ వైద్యులు 20 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని.. తమతోపాటు ఇతర శాఖల్లో చేరిన వారు రెండు, మూడు పదోన్నతులు పొందారని వివరించారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
వైద్యుల సమ్మెకు జీడీఏఏ మద్దతు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మెకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని జీడీఏఏ (గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యదర్శి డాక్టర్ బాబ్జీ శ్యామ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్లు నెరవేర్చాలని, డీఎంఈ వైద్యులకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఇప్పటికే వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.
విజయవాడలో జరిగిన రిలే దీక్షలో పాల్గొన్న పీహెచ్‌సీ వైద్యులు