దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు అధికం
సామాన్యులను బాదేస్తున్న చంద్రబాబు సర్కార్
తాజా పెంపుతో లీటరు పెట్రోల్ రూ.113.62, డీజిల్ రూ.101.24కు చేరిక
పెట్రోల్‌పై రోజూ రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్లు అధికంగా వడ్డన
రేట్ల పెంపుతో సామాన్యుల జేబులకు చిల్లు
ప్రస్తుతం వంట గ్యాస్ రూ.950–980 వాణిజ్య గ్యాస్ రూ.3,300
ఈ రెండేళ్లలో ఇంధనం సహా నిత్యావసరాల రేట్లలో భారీగా పెరుగుదల
నాడు
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్లండంటూ పొరుగు రాష్ట్రాల్లో బోర్డులు పెట్టారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే వాటి ధర ఎక్కువ. ఫలితంగా నిత్యావసరాల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రం వేసే పన్నే ఇందుకు కారణం. ప్రభుత్వం తొలుత ఆ పన్ను తగ్గిస్తే ధరలన్నీ తగ్గుతాయి. టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌పై వేసిన పన్నును తగ్గిస్తాం. తద్వారా రాష్ట్రంలో అన్ని ధరలు తగ్గుతాయి. – ఎన్నికలకు ముందు చంద్రబాబు
నేడు
ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలి. పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలి. తక్కువ దూరాలకు సైకిళ్లను వినియోగించాలి. కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. వారంలో ఒకరోజు నో వెహికల్ డే గా పాటించాలి. – గురువారం కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన రేట్లు భగ్గుమంటున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఠారెత్తిస్తున్నాయి. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. శుక్రవారం నుంచి ఏపీలో లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగింది. అత్యధికంగా పల్నాడులో లీటరు పెట్రోల్ రూ.113.62, డీజిల్ రూ.101.24కు ఎగబాకింది. ఫలితంగా రవాణా రంగంతో పాటు ఆహార, నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడనుంది. వాస్తవానికి ఏపీలో రోజుకు 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 15–20వేల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంది.

తాజాగా ధరల పెరుగుదలతో రోజు పెట్రోల్‌పై రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్లకుపైగా ఆర్థిక భారం పడుతుంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కేరళంతో పోల్చుకుంటే రూ.3, తమిళనాడుతో పోల్చితే ఏకంగా రూ.10, కర్ణాటకతో చూసినా రూ.7 వరకు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. గృహ వినియోగ సిలిండర్ రూ.950–980 ఉంటోంది. కమర్షియల్ గ్యాస్ రూ.3,300కుపైగా చేరింది. నెలల వ్యవధిలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైకి ఎగబాకడంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. పెరిగిన భారం ప్రభుత్వం భరించకుండా ఇంధనం పొదుపు చేయాలంటూ ఉచిత సలహాలు ఇస్తుండటం పట్ల మండిపడుతున్నారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, అధికారంలోకి రాగానే వాటిపై రాష్ట్రం విధిస్తున్న వ్యాట్, తదితర పన్నులు తొలగిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నెటిజన్లు ఉతికారేస్తున్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఆర్థిక ఊరట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వంట నూనెలు సహా నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంకోవైపు ప్రభుత్వం రేషన్‌లో ఇచ్చే సబ్సిడీ కందిపప్పు, గోధుమ పిండి, చిరుధాన్యాల పంపిణీకి మంగళం పాడేసింది. రైతులకు ధాన్యం మద్దతు ధర దక్కకపోగా, బహిరంగ మార్కెట్‌లో బియ్యం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.


