
3,736 మద్యం దుకాణాలకు అనుబంధంగా అన్నిచోట్లా పర్మిట్ రూమ్‌లకు మళ్లీ ‘పచ్చ’జెండా
టీడీపీ సిండికేట్ దోపిడీకి సర్కారు వత్తాసు
ఈ ఏడాది మద్యం ఆదాయం టార్గెట్ ఏకంగా రూ.35 వేల కోట్లు
ఇక రాష్ట్రంలో ఏరులై పారనున్న ‘మందు’
మందు ఏరులై పారించాలి..! మద్యం ఆదాయం రూ.35 వేల కోట్లు దాటించాలి..! ఇదీ టార్గెట్! ఎంత భారీగా తిన్నా బకాసురుడి ఆకలి తీరనట్లుగా... మద్యం విధానం ద్వారా ఎంత బరి తెగించి దోపిడీకి పాల్పడుతున్నా కడుపు నిండని టీడీపీ మద్యం సిండికేట్ ఇంకా కావాలనే అంటోంది! మద్యం దోపిడీలో చంద్రబాబు సర్కారు తీరు బకాసురుడినే తలపిస్తోంది!! అందుకే సిండికేట్ దోపిడీకి మరింత రాచబాట పరుస్తూ రాష్ట్రంలో పర్మిట్ రూమ్‌లకు చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది.
ఈ ఏడాది సెప్టెంబరులో కొత్త బార్లకు లైసెన్సులతోపాటు మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు రిబ్బన్ కత్తిరించాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీర్మానం ద్వారా మద్యం సిండికేట్ లూటీకి అధికారికంగా రాచబాట పరిచింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం ఇకపై వరద ప్రవాహాన్ని తలపించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగం ఇదిగో ఇలా ఉంది..! –సాక్షి, అమరావతి
పర్మిట్ రూమ్‌లతో సిండికేట్ గల్లా పెట్టె గలగలా..
2014–19లో బాబు మార్కు దోపిడీ విధానం
టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పర్మిట్ రూమ్‌లు బూస్టర్ డోస్ లాంటివని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీడీపీ సిండికేట్ ఇదే పర్మిట్ రూమ్‌ల విధానం ద్వారా భారీ దోపిడీకి పాల్పడింది. అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 4,380 మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్ కోసమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా ఒక్కో పర్మిట్ రూమ్‌కు అధికారికంగా లైసెన్స్ జారీ చేశారు.
అంటే మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి పక్కనే ఉండే పర్మిట్ రూమ్‌లలో కూర్చుని విచ్చలవిడిగా తాగేందుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి అది జాతీయ ఎక్సైజ్ విధానానికి విరుద్ధం. కేవలం బార్లలో కూర్చుని మద్యం సేవించేందుకే అనుమతినివ్వాలి. మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి తమ ఇళ్లలోగానీ ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోగానీ సేవించాలి. ఈ విధానానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో కొత్త విష సంస్కృతికి తెర తీసింది. తద్వారా అనధికారిక బార్లుగా పర్మిట్ రూమ్‌లకు అధికారికంగా ప్రభుత్వమే అనుమతినిచ్చింది.
అలా భారీగా అమ్మకాలు పెంచి టీడీపీ సిండికేట్ దోపిడీకి పాల్పడింది. దీనికి మరింత సౌలభ్యం కల్పిస్తూ మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజును మంత్రి మండలి కళ్లుగప్పి 2015లో ఓ చీకటి జీవోతో రద్దు చేసింది. తద్వారా అధికారికంగా నాలుగేళ్లలో రూ.ఐదు వేల కోట్ల మేర ఖజానాకు గండి కొట్టింది. ఇక పర్మిట్ రూమ్‌లలో ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి దోపిడీకి తెగబడింది. తద్వారా ఏకంగా రూ.25 వేల కోట్లకుపైగా కొల్లగొట్టింది. రాజ్యాంగబద్ధ సంస్థ ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ సైతం దీనిపై తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు.
ఆ దోపిడీని గతంలోనే నిగ్గు తేల్చిన సీఐడీ
ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబు
టీడీపీ సర్కారు మద్యం దోపిడీని సీఐడీ 2023లోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ అక్రమాలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైనే ఉన్నారు.
పర్మిట్ రూమ్‌లను రద్దు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
సిండికేట్ దోపిడీకి కొమ్ము కాస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాల విధానానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో ముగింపు పలికింది. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. అంతే కాదు.. అప్పటి వరకు కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్‌ల అనుమతులను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వం దన్నుతో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్టు దుకాణాలను తొలగించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశపెట్టి దశలవారీ నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. దాంతో 2019–24 మధ్య రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి.

పర్మిట్ రూమ్‌లకు పచ్చ జెండా
ఇలా ఓ ప్రాతిపదికను సిద్ధం చేసుకుని టీడీపీ సిండికేట్ దోపిడీకి పక్కాగా స్కెచ్ వేశారు. అంతే.. పర్మిట్ రూమ్‌లకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది! సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లకు లైసెన్సులు అమలులోకి రానున్నాయి. దాంతోపాటు మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించాలని కూటమి సర్కారు నిర్ణయించడం గమనార్హం. అదే బార్లకు లైసెన్సులు జారీ చేసిన తరువాత పర్మిట్ రూమ్‌లకు అనుమతించాలని భావిస్తే బార్ల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకునే అవకాశం ఉంది.
తమ వ్యాపారం దెబ్బ తింటుందని వారు అందుకు సిద్ధపడవచ్చని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. ప్రస్తుతం టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాలకు అనుబంధంగా 3,736 పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పర్మిట్ రూమ్‌కు వార్షిక ఫీజు రూ.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం ఎన్ని దారులు వీలైతే అన్ని దారులూ బార్లా తెరవాలన్నదే ఏకైక లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఇప్పటికే విచ్చలవిడిగా ఏర్పాటైన బెల్టు దుకాణాలతో పట్టణాల్లోని కాలనీలు, పల్లెల్లో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇక పర్మిట్ రూమ్‌లతో పరిస్థితి మరింత దిగజారుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు పర్మిట్ రూమ్‌లకు పచ్చజెండా ఊపింది.
దందాకు పక్కా స్కెచ్..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాతాళంలో పాతి పెట్టేసిన ప్రైవేటు మద్యం సిండికేట్ భూతానికి ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఊపిరిపోసి రాష్ట్రంపైకి వదిలింది. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టింది. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే ఏకపక్షంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. ఇతరులు ఎవరూ దరఖాస్తు కూడా దాఖలు చేయకుండా టీడీపీ గూండాలతోపాటు పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తరువాత కల్లుగీత కుటుంబాల ముసుగులో టీడీపీ సిండికేటే మరో 340 దుకాణాలను సైతం తమ గుప్పిట్లో పెట్టుకుంది.
ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాల ద్వారా టీడీపీ సిండికేట్ మద్యం దోపిడీకి పాల్పడుతూ వాటి పరిధిలో దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎంఆర్‌పీ కంటే 20 నుంచి 30 శాతం అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నా టీడీపీ సిండికేట్ ఆకలి చల్లారడం లేదు. అందుకే గతంలో టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పర్మిట్ రూమ్‌ల విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలన్న సిండికేట్ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే సమ్మతించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించే ప్రతిపాదనలను రూపొందించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించారు.
2024–25లో మద్యం విధానం ద్వారా ఎక్సైజ్ శాఖకు వచ్చిన రూ.24 వేల కోట్ల ఆదాయం 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్లకు చేరుకోవాలని నిర్దేశించారు. అందుకోసం పర్మిట్ రూమ్‌లకు అనుమతించడం ఓ మార్గమని నిర్ణయించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ ఆగమేఘాల మీద ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పర్మిట్ రూమ్‌లు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఏటా రూ.180 కోట్ల మేర ఆదాయం కోల్పోతోందని నిస్సిగ్గుగా ఓ సమర్థింపు ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందువల్ల పర్మిట్ రూమ్‌లకు మళ్లీ పచ్చజెండా ఊపారు.