పథకాల వారధులు సర్పంచులు

Peddireddy Ramachandra Reddy Comments On Welfare Schemes In AP - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సర్పంచులకు శిక్షణ తరగతులు ప్రారంభం

సాక్షి, అమరావతి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువచేసే బాధ్యత పంచాయతీ సర్పంచులదేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలనపై మొత్తం 60 కేంద్రాల్లో శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కాలేజీ ఆడిటోరియంలో విజయవాడ డివిజన్‌ పరిధిలోని సర్పంచులకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 అంశాల్లో ఇస్తున్న ఈ శిక్షణను ఉపయోగించుకుని సర్పంచులు సమర్థ నాయకత్వంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. అత్యుత్తమ పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామసచివాలయ, వలంటీర్ల వ్యవస్థలకు శ్రీకారం చుట్టారన్నారు. సర్పంచులు ఈ వ్యవస్థలను పర్యవేక్షిస్తూ, ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా చేయాలని సూచించారు. 

ఆగస్టు 15 నుంచి జగనన్న స్వచ్ఛసంకల్పం
గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం, పారిశుధ్యంపై చైతన్యం పెంచడం కోసం ఆగస్టు 15 నుంచి 100 రోజులు జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్పంచులు నడుంకట్టాలన్నారు. పచ్చదనం పెంచేందుకు జగనన్న పచ్చతోరణం కింద మొక్కల పెంపకంను ప్రారంభించామని, గ్రామాల్లో 83 శాతం మొక్కలు బతికేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంటిపన్ను, నీటిపన్ను, లైసెన్స్‌ ఫీజులు, కంపోస్ట్‌ ఎరువుల విక్రయాలు, వేలం పాటల ద్వారా పంచాయతీలకు ఆర్థిక వనరులను పెంచుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల గురించి మంత్రి వివరించారు. అంతకుముందు ఆయన అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామ సర్పంచుల కరదీపికను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎస్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జె.మురళి, కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె.నివాస్, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశ్, డీపీవో జ్యోతి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top