ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్‌

Peddireddy Ramachandra Reddy Comments On Electricity Prices - Sakshi

అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు, భవిష్యత్‌ తరాలకు అందుబాటు ధరలో విద్యుత్‌ పుష్కలంగా ఉండేలా ప్రభుత్వం అనేక  చర్యలు చేపడుతోందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవడంతో విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2017–18లో 50,077 మిలియన్‌ యూనిట్లు ఉన్న డిమాండ్‌ 2021–22లో 60,943 మిలియన్‌ యూనిట్లకు (21.6 శాతం)  పెరిగిందని తెలిపారు.

వచ్చే మార్చి నాటికి డిమాండ్‌ రోజుకు 250 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కృష్ణపట్నం) స్టేజ్‌–2 (1్ఠ800 మెగావాట్లు) ఈ నెలాఖరుకు, డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్టీటీపీఎస్‌)లో స్టేజి–5 (1్ఠ800 మెగావాట్లు) వచ్చే మార్చి నాటికి ప్రారంభించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు.   

పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట
డిమాండ్‌ను అందుకోవడంతోపాటు విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి,  నెడ్‌క్యాప్‌ ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top