నేటితో ముగియనున్న ‘పరిషత్‌’ ప్రచారపర్వం

Parishad election campaign ends today in AP - Sakshi

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 8వ తేదీ సెలవు 

48 గంటల ముందు నుంచి ఎన్నికలు ముగిసే దాక మద్యం అమ్మకాలు బంద్‌

ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగానూ ఓటర్లను ప్రభావితం చేయరాదు

మార్గదర్శకాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఏప్రిల్‌ 8వ తేదీన జరుగనున్న ఎన్నికలు, 10వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.  ఇలా ఉండగా  పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. కోవిడ్‌–19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్‌ సామగ్రి, పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ, రవాణా ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సమాచార కేంద్రాలు, ఎన్నికల నిబంధనలు, కౌటింగ్‌ ఏర్పాట్లు వంటి అంశాలపై  ద్వివేది సమీక్షించారు.

8న ప్రభుత్వ సెలవు..
నేగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ 1881 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్‌ 8వ తేదీన సెలవుదినంగా రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించింది. అలాగే  ఏపీపీఆర్‌ యాక్ట్‌ 225ఏ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1988 ప్రకారం 8వ తేదీని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ఎన్నికల తేదీని స్థానిక సెలవుగా ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలను ఒక రోజు ముందు నుంచి..అనగా 7వ తేదీ నుంచి వినియోగించుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేయరాదని, అలాగే  ఎవరికి ఓటు వేశామన్న  విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది.  

చిటికెన వేలుపై సిరా గుర్తు
గురువారం జరుగనున్న పరిషత్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎడమ చేతి చిటికెన వేలుసై సిరా గుర్తు వేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గత   పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేసినందున అది ఇంకా చెరగకపోవడంతో చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఆ ఉత్తర్వుల్లో  స్పష్టం చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top