అటు కుక్కర్లు.. ఇటు ప్లాస్టిక్‌ స్టూళ్లకు డిమాండ్‌

Panchayat Elections; Demand For Cookers And Plastic Stools - Sakshi

పంచాయతీ ఎన్నికల్లో వార్డు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రభావం 

మార్కెట్లో నో స్టాక్‌..

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అభ్యర్థులు 

అమలాపురం టౌన్‌: పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని మార్కెట్లో కుక్కర్లు...ప్లాస్టిక్‌ స్టూల్స్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరిగిపోయింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల అభ్యర్థులకు ఈ గుర్తులను  కేటాయించడంతో ఆయా అభ్యర్థుల్లో కొందరు ఓటర్లకు తమ గుర్తును తెలియజేస్తూ వారికి నిజమైన కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ నజరానాగా ఇచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కేటాయించిన గుర్తుల నమూనాలు అవసరమైతే పెద్దవిగా తయారు చేయించి ఓటర్లను ఆకర్షించేలా ప్రదర్శిస్తున్నారు. సర్పంచ్‌ అభ్యర్థులకు కేటాయించిన ఉంగరం, కత్తెర, మంచం తదితర గుర్తులను పెద్దవిగా నమూనా తయారు చేయించి వాటినే ప్రచారాల్లో విరివిగా ఉపయోగించుకుంటున్నారు.

కొందరు సర్పంచ్‌ అభ్యర్థులు బుల్లి మంచాల నమూనాలు, లేదా వాస్తవ మంచాలతోనే ప్రచారం చేస్తున్నారు. వార్డుల అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తుల్లో ముఖ్యంగా కుక్కర్, స్టూలు గుర్తులను నమూనాగానే కాకుండా అసలైన కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ను కొనుగోలు చేసి మరీ ఓటర్లకు అందిస్తున్నారు. నాలుగో విడతగా అమలాపురం డివిజన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లోని వార్డుల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో చాలా మంది తమకు గుర్తులు కేటాయించిన తక్షణమే ఇలా కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ కొనుగోళ్లు చేయడంతో మార్కెట్లో వీటికి డిమాండ్‌ పెరిగింది.

పి.గన్నవరం మండలంలోని ఓ మేజర్‌ పంచాయతీలో రెండు వార్డుల్లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ తొలి రోజు కొనుగోలు చేసి కొందరు ఓటర్లకు పంచిపెట్టినా, మర్నాడు మిగిలిన ఓటర్లకు పంచిపెట్టేందుకు మార్కెట్‌కు వెళితే కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ స్టాక్‌ లేదన్న సమాధానంతో నిరుత్సాహ పడ్డారు. కోనసీమలో అన్ని మండలాల్లో ముఖ్యంగా మేజర్‌ పంచాయతీల వార్డుల అభ్యర్థుల్లో చాలా మంది కుక్కర్లు, ప్లాస్టిక్‌ స్టూల్స్‌ ఇచ్చే ఓట్లు అడుగుతున్నారు. ఇలా ఇస్తున్న గ్రామాల్లో ఓటర్లు చమత్కారంగా జోక్‌లు వేసుకుంటున్నారు. ఉంగరం (రింగ్‌) గుర్తు వచ్చిన సర్పంచ్‌ అభ్యర్థులు ఒక్కో బంగారం ఉంగరం ఓటర్లకు ఇస్తే ఎంత బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top