నెట్టింటి వైద్యం రెట్టింపు రోగం | Online Search for Medical Services: Doubts about Medicines Prescribed Even After Visiting Doctor | Sakshi
Sakshi News home page

నెట్టింటి వైద్యం రెట్టింపు రోగం

May 27 2025 2:52 AM | Updated on May 27 2025 6:11 AM

Online Search for Medical Services: Doubts about Medicines Prescribed Even After Visiting Doctor

వైద్యసేవలకు ఆన్‌లైన్‌ శోధన 

మందులు తెలుసుకొని సొంత వైద్యం 

వైద్యుల వద్దకు వెళ్లినా రాసిచ్చిన మందులపై అనుమానం 

మంచివో.. కాదోనని ఇంటర్‌నెట్‌లో తెలుసుకునే ప్రయత్నం 

సోషల్‌ మీడియా కథనాలను అనుసరిస్తున్న వైనం 

తెలిసీ తెలియని వైద్యంతో అవస్థలు

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేల దాకా రిటైల్‌ మెడికల్‌ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. దీంతో పాటు 12వేల దాకా ఎంబీబీఎస్, స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు అభ్యసించిన వైద్యులూ ఉన్నారు. వీరితో పాటు వైద్యవిద్యను అభ్యసిస్తున్న వారు మరో 3వేల మంది దాకా ఉంటారు. ఇక ఫార్మాసిస్టులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆర్‌ఎంపీలు మరో 15వేల దాకా ఉంటారు. వీరందరూ అల్లోపతి వైద్యంపై ఆధారపడి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన ప్రజలు వీరిలో ఎవరో ఒకరిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు.

ఇటీవల ఇంటర్‌నెట్‌ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడం, విద్యావంతులు పెరగడం, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ఇంటర్‌నెట్‌పై యువతకు పట్టురావడం వంటి విషయాల కారణంగా ఆన్‌లైన్‌లో తమకు వచ్చిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని వెతకడం అధికమైంది. క్షణాల్లో వచ్చే సమాచారం ఆధారంగా తమకు ఈ కారణంగానే ఆరోగ్య సమస్య వచ్చిందని భావించి మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తీసుకుని వాడే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది.  

భౌతికంగా పరీక్షిస్తేనే.. 
మంచి పేరున్న వైద్యుని వద్దకు వందల కిలోమీటర్లు ప్రయాణించి రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. అలా వెళ్లిన వారు అవసరమైతే గంటల తరబడి క్యూలో ఉండి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. ఫలానా డాక్టర్‌ చేయి తగిలితేనే(హస్తవాసి) సగం రోగం నయం అవుతుందన్న నమ్మకంతో ఉన్న వారూ ఉన్నారు. ఈ నమ్మకంతోనే ఇప్పటికీ చాలా మంది వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నమ్ముకున్న వైద్యుల వద్దే చికిత్స తీసుకుంటారు.

సదరు డాక్టర్‌ భౌతికంగా రోగిని పరిశీలించడమే గాక వారి యోగక్షేమాలు అడగడం, నవ్వుతూ మాట్లాడటం, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పడంతో వారికి సగం రోగం నయమవుతుంది. కొందరు సీనియర్‌ వైద్యులు ఇప్పటికీ రోగిని భౌతికంగా ముట్టుకుని చేతులు, కాళ్లు కదిపి, పొట్టను ఒత్తి చూసి, నాడి పట్టుకుని పరీక్షించి వైద్యం చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఆన్‌లైన్‌లో లభించవని పెద్దలు చెబుతుంటారు. ఎంతగా ఆన్‌లైన్‌ సేవలు అభివృద్ధిలోకి వచ్చినా మనిíÙని చూసి వైద్యం ఇచ్చి ధైర్యం చెబితేనే తగ్గుతుందని వారు భావిస్తున్నారు.  

ఇవీ నష్టాలు.. 
ఆరోగ్య సమస్య కొంతైతే ఆన్‌లైన్‌లో వివరాలు కొండంత ఉంటాయి. దానిని చూసి రోగి మరింత ఆందోళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా మరింత కృంగిపోతాడు.  
⇒ ఆందోళనకు గురైతే శారీరకంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

⇒ కొందరు ఆన్‌లైన్‌లో తమ ఆరోగ్య సమస్యలు వెతికి ముందుగానే అ్రల్టాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకుని డాక్టర్‌ వద్దకు వెళ్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.  
⇒ ఒక్కో వ్యక్తికీ ఒక్కో శరరీతత్వం ఉంటుంది. వారి జన్యువులు, వారి ఆరోగ్యాన్ని బట్టి రోగ లక్షణాలు ఉంటాయి. అందరినీ ఒకే విధంగా చూడలే మని వైద్యులు చెబుతున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన చికిత్స ఉంటుందని, ఆన్‌లైన్‌ వైద్యాన్ని గుడ్డిగా నమ్మొద్దని సూచిస్తున్నారు.  

⇒ కర్నూలుకు చెందిన రాజ్‌కుమార్‌ ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్‌. రోజూ వందల కిలోమీటర్లు తిరగడంతో అతనికి ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంటుంది. దీంతో తరచూ డాక్టర్‌ వద్దకు వెళ్లడం దేని­కని ఆన్‌లైన్‌లో తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు పరిష్కారాన్ని వెతికి మెడికల్‌ షాపులో మందులు కొని వాడుతున్నాడు. ఓ రోజు మందు లు వికటించి ఆసుపత్రికి వెళితే ఎలా పడితే అలా మందులు వాడకూడదని వైద్యులు చికిత్స చేసి పంపించారు.  

⇒ కర్నూలుకు చెందిన ఓ బి.ఫార్మసి విద్యార్థిని తనకు ఇటీవల ఛాతీలో నొప్పి ఉంటే ఆన్‌లైన్‌లో టైప్‌ చేసి చూసుకుంటే హార్ట్‌ ఎటాక్‌ అని చూపించింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసింది. పరీక్షించిన వైద్యులు వచ్చింది హార్ట్‌ ఎటాక్‌ కాదని, కండరాల నొప్పిగా నిర్ధారించారు.

⇒ నంద్యాలకు చెందిన రామాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పనిచేయాల్సిందే. ఇంటర్‌నెట్‌పై మంచి పట్టు ఉంది. దీంతో తనతో పాటు ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలువచ్చినా ఆన్‌లైన్‌లో వెతికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆయన తల్లికి ఒకసారి మందులు వికటించి ఇబ్బంది రావడంతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ఆన్‌లైన్‌ పరిష్కారం ప్రతిసారీ మంచిది కాదని వైద్యులు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement