Olive Ridley Turtle: వెళ్తాం..పెరిగి పెద్దయి.. మళ్లొస్తాం! 

Olive Ridley Turtles Released Into the Sea In Visakha - Sakshi

బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): వెళ్తాం.. పెరిగి పెద్దయి.. గుడ్లు పెట్టేందుకు మళ్లీ ఇక్కడకు వస్తాం అంటూ బుల్లి తాబేళ్లు బుడి బుడి అడుగులు వేసుకుంటూ.. సముద్రంలోకి వెళ్లిపోయాయి. అంతరించే ప్రమాదమున్న ఆలివ్‌ రిడ్లే తాబేలు పిల్లలను జిల్లా అటవీ శాఖ పరిరక్షించి సముద్రంలోకి విడిచిపెట్టింది. సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లను చూసి పిల్లలు, ప్రకృతి ప్రేమికులు, యువతీయువకులు పరవశించిపోయారు. ఆర్‌.కె.బీచ్‌ వేదికగా ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులతో కలిసి కలెక్టర్‌ మల్లికార్జున బుల్లి తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టి.. వాటి తల్లుల వద్దకు చేర్చారు.

 బుడిబుడి అడుగులతో సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లు 

ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. అది కూడా రాత్రి 2 గంటల నుంచి వేకువ 5.30 గంటల్లోపు మాత్రమే. ఈ సమయంలోనే ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లను పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఆ గుడ్లను సేకరించిన అటవీ శాఖ అధికారులు బీచ్‌రోడ్డులోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో 45 రోజుల పాటు సంరక్షించారు. సేకరించిన గుడ్లు పొదిగి పిల్లలుగా మారాయి.

చదవండి: అంత యాక్షన్‌ వద్దు.. పులి కూడా బ్రష్‌ చేస్తుంది!

తాబేలు పిల్లను పట్టుకుని ఆనందిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున

అలా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 982 బుల్లి తాబేళ్లను సూర్యోదయం సమయంలో కలెక్టర్‌ సముద్రంలోకి విడిచిపెట్టారు. ఆ సమయంలో తల్లులు తీరానికి చేరువలో ఉంటాయి. అందుకే పిల్లలను సూర్యోదయ సమయంలో సముద్రంలోకి విడిచిపెట్టడం ద్వారా అవి తల్లుల వద్దకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారి అనంత్‌శంకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ సముద్ర జలాలను శుద్ధి చేసే ఈ రకం తాబేళ్లు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
 
సముద్రంలోకి విడిచిపెట్టేందుకు బుట్టల్లో సిద్ధంగా ఉన్న తాబేలు పిల్లలు

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top