అదనపు చార్జీల భారం లేదు.. ప్రయాణికులకు పండుగే

Normal Ticket Fares During Sankranti Festival In APSTRTC Buses - Sakshi

సగటున కుటుంబానికి రూ.2 వేల నుంచి రూ.4 వేలు మిగులు

గతంలో పండుగలు, వరుస సెలవుల్లో చార్జీల బాదుడు

పేద, మధ్య తరగతి ప్రయాణికులకు జగన్‌ సర్కార్‌ ఊరట 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పండుగ సమయాల్లో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రయాణికులకు జగన్‌ సర్కార్‌ ఊరటనిచ్చింది. గతంలోలా అద­నపు చార్జీల భారం మోపుతూ జేబులు గుల్ల చే­యడం లేదు. ఇది వరకు ప్రతి పండుగ సమయంలో, వరుస సెలవులప్పుడు, దాదాపు రద్దీ స­మ­యాల్లో ప్రయాణికుల నుంచి ఏపీ­ఎస్‌ఆర్టీసీ సాధా­రణ చార్జీలకు మించి 50 శాతం వరకు అదనంగా వసూలు చేసేది. దూరాన్ని బట్టి సగటున ఒక్కో కుటుంబం రెండు వేల నుంచి నాలుగు వేల రూ­పా­యల వరకు అదనంగా చెల్లించి ప్రయాణించాల్సి వచ్చేది. 

‘సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేది సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల పేరిట వారి నుంచి అదనంగా టికెట్‌ వసూలు చేయడం తగదు. ఈ విషయంలో సహేతుక నిర్ణయాలు తీసుకోండి’ అని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు 3000 సర్వీసుల్లోని 1.40 లక్షల సీట్లకు సంబంధించి అదనపు చార్జీల వసూళ్ల జోలికి వెళ్లడం లేదని ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లిఖార్జునరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. గతంలో మనుగడ కోసం అంటూ ఆర్టీసీ ఫక్తు వ్యాపార ధోరణిలో కార్యకలాపాలను నిర్వర్తించేది. డిమాండ్‌ ఆధారంగా రెగ్యులర్‌ చార్జీలపై 10, 20 శాతం పెంచి వసూలు చేసేది. స్పెషల్‌ బస్సుల్లో 50 శాతం వరకు వసూలు చేసే వారు. 

ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి విశాఖకు సూపర్‌ లగ్జరీ బస్సులో నలుగురు సభ్యులున్న ఓ కుటుంబానికి సాధారణ టికెట్‌ రూ.4,440 అవుతుంది. 50 శాతం పెంపుతో రూ.6,520 అవుతుంది. ఈ లెక్కన అదనపు భారం రూ.2,080. అమరావతి ఏసీ బస్సులో అయితే రూ.3,200 అదనపు భారం పడుతుంది. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం వల్ల ఇప్పుడు ఏ బస్సు­లోనూ ఇలా అదనపు భారం ఉండదు. ఈ నిర్ణ­యం వల్ల ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల అదనపు ఆదాయం ఉండక పోయినా, సీఎం ఆదేశాల మే­రకు ప్రజలకు మేలు కలుగుతోందని ఏపీఎస్‌­ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు తెలిపారు.

4 టికెట్‌లపై రూ.3,600 మిగులు
గతంలో హైదరాబాద్‌ నుంచి అమలాపురం రావాలంటే టికెట్‌ రేట్లు చూసి భయపడేవాళ్లం. ప్రయివేటు ట్రావెల్స్‌ వారి తరహాలో ఆర్టీసీ కూడా అదనంగా వసూలు చేసేది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒక టికెట్‌పై రూ.450 వరకు అదనపు భారం లేదు. మా కుటుంబంలో నలుగురికి రానుపోను కలిపి ఇప్పుడు రూ.3,600 అదనపు భారం తప్పినట్లే. ఇది పండుగ ఖర్చుకు కలిసి వచ్చినట్లే. 
– కోడూరి సత్య మణికంఠ, ప్రయాణికుడు, అమలాపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top