శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్‌ దాటితే మళ్లీ డిసెంబరే 

No Wedding Muhurthams Until December Again after June 2022 - Sakshi

ముగియనున్న సుముహూర్తాలు 

జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

కడప కల్చరల్‌ : శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు...అంటున్నారు పురోహితులు. అవును మరి...వచ్చేనెల (జూన్‌) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ఉండవు. అందుకే తల్లిదండ్రులు హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూడక తప్పదు గనుక ఉన్నంతలో ఈ ముహూర్తాలకే తమ బిడ్డల పెళ్లిళ్లు కానిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ముమూర్తాలు తక్కువ కావడం...ఉన్నా...కరోనా కారణంగా పెళ్లిళ్లు జరగకపోవడం, నిబంధనల కారణంగా వివాహాల సంఖ్య తగ్గడం, వాయిదాపడటంతో రెండేళ్లుగా పెళ్లి సందడి పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు విరివిగా ఉండడంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మార్మోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి.. జరుగుతున్నాయి.. ఈ నెల (మే) తర్వాత జూన్‌ మినహా (ఆగస్టులో కొద్దిగా) డిసెంబరు వరకు ముహూర్తాలు లేవు.

ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారు ఆరు నెలలపాటు ఎదురు చూడటం మంచిది కాదన్న ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. పైగా ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా ఈ మధ్య కాలంలో మళ్లీ మన వైపు చూస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతోంది. ఆ.. ఏం కాదు...నిదానమే ప్రధానమని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. కానీ నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పలుచోట్ల డిసెంబరు వరకు కల్యాణ మండపాలు రిజర్వు అయిపోయాయి. డెకరేషన్, కేటరింగ్‌ తదితరాలకు కూడా టోకన్‌ అడ్వాన్స్‌ ఇచ్చి ఉన్నారు.  

గండం దాటుకుంటాం 
ఐదు నెలలుగా జరుగుతున్న వివాహాల వల్ల జిల్లాలో వ్యాపారాలు జోరందుకున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాక ధరలు రోజురోజుకు పెరుగుతున్నా పెళ్లిళ్ల కారణంగా డిమాండ్‌ తగ్గడం లేదు. వరుసగా రెండేళ్లపాటు దారుణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ వివాహాల ద్వారా కోలుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారాలు ఈ వివాహాల ద్వారానే జరిగాయి. దీంతో వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

భయపెడుతున్న బంగారం
రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని పిల్లల పెళ్లిళ్లకు సిద్ధమైన తల్లిదండ్రులు అవసరమైన బంగారం కొంటున్నారు. ప్రస్తుత ధరల్లో తులం బంగారంతో ఆభరణం చేయించాలంటే రూ. 55–60 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కానీ వివాహాలలో బంగారం ప్రధానపాత్ర పోషిస్తుండడంతో దాన్ని కొనేందుకు తల్లిదండ్రులకు తప్పడం లేదు. దీంతో ఇటీవల బంగారం ధర  పెరిగినా కొనుగోలు కూడా పెరుగుతోందని వ్యాపారులు తెలుపుతున్నారు. 

రికార్డు స్థాయిలో 
గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలపాటు వరుసగా ఉండడంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల 18 వరకు మొత్తం 37 ముహూర్తాలు ఉండగా, జిల్లా వ్యాప్తంగా చిన్న, ఓ మోస్తరు వివాహాలు ఇప్పటివరకు ఐదు వేలు జరగ్గా, భారీ వివాహాలు దాదాపు 1000 వరకు జరిగినట్లు ఆయా వర్గాల  సమాచారం. వీటి ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మే 18 నుంచి డిసెంబరు చివరి ముహూర్తంలోపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు వేల చిన్న, పెద్ద వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మరో రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top