విశాఖ, విజయవాడలో ‘నిక్సీ’ కేంద్రాలు 

NIXI Centers For Internet Services In Visakha And Vijayawada - Sakshi

ఇక రాష్ట్రంలో ఇంటర్నెట్‌ దూకుడు.. ఇప్పటికే కనెక్టివీటీ పనుల కోసం టెండర్లు 

విశాఖలో ఇన్ఫోసిస్, విజయవాడలో యాక్సెంచర్‌ సంస్థల ఆసక్తి 

ఐటీ, పరిశ్రమల, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు మరింత వేగం 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశేష నగరంగా ప్రధాని ప్రశంసలందుకున్న విశాఖతో పాటు విజయవాడలోనూ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నేషనల్‌ ఇంటర్నెట్‌ ఎక్స్చేంజీ ఆఫ్‌ ఇండియా (నిక్సీ) నిర్ణయించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఇంటర్నెట్‌ వినియోగం నేపథ్యంలో అంతరాయ సమస్యలను అధిగమించేందుకు ఎక్స్చేంజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే.. ఇంటర్నెట్‌ సేవలందించే సర్వీస్‌ ప్రొవైడర్లు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఉన్నాయి.

ఇకపై ఈ సమస్య ఉత్పన్నం కాకుండా విశాఖ, విజయవాడ కేంద్రంగా ఇంటర్నెట్‌ ఎక్స్చేంజీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. నిక్సీ కేంద్రాలు ఏర్పాటైతే ఇంటర్నెట్‌ ఎకోసిస్టమ్‌ వృద్ధి చెంది.. ఐటీ పరిశ్రమలు తమ ఉత్పత్తుల దూకుడు పెంచేందుకు అవకాశాలూ మెరుగుపడనున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, విజయవాడలో యాక్సెంచర్‌ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి.  

గతంలోనే పరిశీలన..  
వాస్తవానికి విశాఖపట్నంలో నిక్సీ ఏర్పాటుపై గతంలోనే ఒకసారి ప్రయత్నాలు జరిగాయి. 2019 చివరి త్రైమాసికంలో నిక్సీ బృందం పలు దఫాలుగా విశాఖపట్నంలో పర్యటించింది కూడా. నిక్సీ ఢిల్లీ కేంద్రం టెక్నికల్‌ మేనేజర్‌ అభిషేక్‌ గౌతమ్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ నిఖిల్‌ విశాఖలోని ఐటీ పరిశ్రమల్ని ఇప్పటికే రెండు మూడు సార్లు సందర్శించి.. ఇక్కడ బ్రాంచ్‌ ఏర్పాటుకు గల అనుకూలతల్ని అడిగి తెలుసుకున్నారు.

అయితే, తదనంతర కాలంలో కోవిడ్‌ పరిస్థితుల కారణంగా నిక్సీ కేంద్రం ఏర్పాటు  ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న నిక్సీ కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెంచడం కోసం పాయింట్‌ టు పాయింట్‌ కనెక్టివిటీ కోసం చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే టెండర్లను కూడా నిక్సీ ఆహ్వానించింది. ఈ నెలాఖరులోగా ఈ టెండర్లను ఖరారు చేసి కనెక్టివిటీ పెంచిన తర్వాత కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  

ఏమిటీ ఉపయోగం..  
రోజురోజుకీ ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతోంది. ప్రతి చిన్న రోజువారీ అవసరాలకు ఇంటర్నెట్‌ తప్పనిసరిగా మారింది. మారుతున్న జీవనశైలికి  అనుగుణంగా ఇంటర్నెట్‌లో వేగం పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్స్చేంజీ సేవలు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని కారణంగా ఆయా సంస్థలకు 40 శాతం అదనపు భారం పడుతోంది.

నగర పరిధిలో ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, బ్యాంకులు, రైల్వే బుకింగ్‌ కేంద్రం, వివిధ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య సంస్థలు.. మొదలైన సంస్థలు బల్క్‌ కేంద్రాలుగా ఇంటర్నెట్‌ని వినియోగిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నిక్సీ ఏర్పాటైతే.. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలు అందనున్నాయి.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top