NITI Aayog Member Ramesh Chand Meet CM YS Jagan - Sakshi
Sakshi News home page

ఏపీలో వృద్ధి చాలా బాగుంది.. నీతి ఆయోగ్‌ బృందం ప్రశంసలు

Jul 22 2022 6:02 PM | Updated on Jul 22 2022 6:52 PM

NITI Aayog Member Ramesh Chand Meet CM YS Jagan - Sakshi

దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా మెరుగ్గా ఉందన్నారు.  ప్రతీ రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరును రమేష్‌చంద్‌ ప్రశంసించారు.

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో నీతి ఆయోగ్‌ సభ్యులు రమేష్‌ చంద్, బృందం భేటీ అయ్యారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా.. ఏపీలో వృద్ధి చాలా బాగుందని రమేష్‌ చంద్‌ ప్రశంసించారు. దీనికి సంబంధించిన గణాంకాలను సీఎంకు రమేష్‌ చంద్‌ వివరించారు. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా మెరుగ్గా ఉందన్నారు.  ప్రతీ రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరును రమేష్‌చంద్‌ ప్రశంసించారు.
చదవండి: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు 

జీరోబేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్, ఆర్గానిక్‌ వ్యవసాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్‌ ఒన్‌ అన్న రమేష్‌ చంద్‌.. ఆయిల్‌పామ్‌ సాగుద్వారా వంటనూనెలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని ప్రశంసించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని క్షేత్రస్థాయిలో అత్యుత్తమ వ్యవస్థ  అని నీతి ఆయోగ్‌ సభ్యుడు కొనియాడారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ దేశం సగటు కన్నా ఏపీ సగటు అధికమని రమేష్‌ చంద్‌ అన్నారు.

రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సీఎం వివరించారు. వ్యవసాయం, వైద్య, విద్య, గృహనిర్మాణ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చామని సీఎం తెలిపారు. ‘‘ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడిపిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణపోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారిత కోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి యాభైఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టామని, గ్రామ–వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజంను సమర్థవంతంగా నడిపిస్తున్నామని’’ సీఎం పేర్కొన్నారు.

డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమన్న సీఎం.. పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్యపరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామన్నారు. దీనివల్ల జీఈఆర్‌ పెరుగుతుందని సీఎం అన్నారు. విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్న సీఎం.. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారుచేస్తున్నామని పేర్కొన్నారు.

ఏ రంగంలోనైనా రాణించాలంటే.. ఇంగ్లిషు, నాణ్యమైన విద్య చాలా అవసరం. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం. తరగతి గదులను డిజిటల్‌ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నాం. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి స్థాయి రీయింబర్స్‌ మెంట్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అన్న సీఎం.. అలాగే వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నామన్నారు. దీనివల్ల జీఈఆర్‌ గణనీయంగా పెరుగుతుందని సీఎం తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో , బోధనాసుపత్రుల్లో నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా  చేపడుతున్నాం. ప్రతి గ్రామంలో, వార్డుల్లో కూడా విలేజ్, వార్డు క్లినిక్స్‌పెడుతున్నాం. ఆరోగ్యశ్రీకి రిఫరల్‌పాయింట్‌గా, వ్యాధుల నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పీహెచ్‌సీలతో, అక్కడున్న డాక్టర్లతో అనుసంధానమవుతాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నాం.  3 వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నాం. ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్‌ కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఆర్బీకేల వ్యవస్థ, సీఎం యాప్‌ పనితీరు తదితర అంశాలు, ఫుడ్‌ ప్రాససింగ్‌ కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి వివరించిన సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాలు గురించి కూడా నీతి ఆయోగ్‌ బృందానికి సీఎం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement