వేడిరాత్రులు.. ప్రమాద ఘంటికలు | Nighttime Heat Is More Dangerous Than Daytime Heat: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వేడిరాత్రులు.. ప్రమాద ఘంటికలు

Apr 21 2026 1:29 AM | Updated on Apr 21 2026 1:29 AM

Nighttime Heat Is More Dangerous Than Daytime Heat: Andhra Pradesh

పెరుగుతున్న వార్మ్‌నైట్‌ ముప్పు

పగటి కంటే రాత్రి వేడి డేంజర్‌

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గాలిలో తేమ  

సముద్రగాలుల మార్పుతో మరింత కష్టం 

ప్రజారోగ్యంపై నిశ్శబ్దదాడి

సాక్షి, అమరావతి: వేసవి అంటే మండిపోయే పగలు, ఉపశమనం ఇచ్చే రాత్రులు. కానీ ఇప్పుడు సూర్యుడు అస్తమించినా సెగలు తగ్గడం లేదు. రాత్రి ఏడుగంటలు దాటినా గాలిలో వేడి తగ్గకపోగా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. దీన్ని వార్మ్‌నైట్‌ విపత్తుగా పిలుస్తున్నారు. సాధారణంగా భూమి పగలు సూర్యుడి నుంచి గ్రహించిన వేడిని రాత్రి సమయాల్లో తరంగాల రూపంలో అంతరిక్షంలోకి వదిలేస్తుంది.

దీనివల్ల తెల్లవారుజామున వాతావరణం చల్లబడుతుంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో పెరిగిన కాలుష్య పొరలు ఈ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి 12 గంటల సమయంలో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే తగ్గకపోవడం గమనార్హం.  

ఆరోగ్యానికి పెనుముప్పు 
రాత్రిళ్లు వేడి తగ్గకపోవడం వల్ల మన శరీరం రీసెట్‌ అయ్యే అవకాశం కోల్పోతోంది. నిద్రలో గుండె వేగం తగ్గాలి. కానీ బయటి వేడి వల్ల శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత 25 డిగ్రీల పైన ఉంటే గాఢనిద్ర పట్టదు. ఇది మరుసటిరోజు పనితీరుపై ప్రభావం చూపడమే కాకుండా దీర్ఘకాలంలో చిరాకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.  

పంటలకూ దెబ్బ 
రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరి వంటి పంటల దిగుబడి తగ్గిపోతుంది. మొక్కలు రాత్రివేళ ఎక్కువ శ్వాసక్రియ జరపడం వల్ల గింజ గట్టిపడక తాలుశాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు అంటే ఎక్కడో మంచు పర్వతాలు కరగడం మాత్రమే కాదు. మన ఇంటి పైకప్పులు నిప్పుల కుంపట్లుగా మారడం కూడా అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నగరాల్లో పచ్చదనాన్ని పెంచడం, భవనాలపై కూల్‌ రూఫ్‌ పెయింట్స్‌ వేయడం, కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వార్మ్‌నైట్‌ ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  

కారణాలివే ఈ వేడిరాత్రులకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.  
1. నగరాల్లో చెట్లు తగ్గిపోయి కాంక్రీట్‌ భవనాలు, తారు రోడ్లు పెరిగాయి. ఇవి పగలు వేడిని పీల్చుకుని రాత్రివేళ బయటకు వదులుతాయి. పల్లెటూళ్లలో వేడి త్వరగా తగ్గుతున్నా, నగరాల్లో మాత్రం ఈ కాంక్రీట్‌ సెగలు రాత్రంతా కొనసాగుతున్నాయి. దీన్ని అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌గా పేర్కొంటున్నారు.  
2. మనది తీర ప్రాంత రాష్ట్రం కావడంతో గాలిలో తేమశాతం ఎక్కువ. గాలిలో తేమ పెరిగినప్పుడు అది ఒక దుప్పటిలా మారి భూమి నుంచి వెలువడే వేడిని అంతరిక్షంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.  
3. బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రాత్రివేళ సముద్రం నుంచి వచ్చే గాలులు చల్లదనానికి బదులు సెగలను మోసుకొస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement