5 కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే ఏడాది అడ్మిషన్లు!

Next year admissions in 5 new medical colleges Andhra Pradesh - Sakshi

2024 – 25లో మరో ఐదు వైద్య కళాశాలల్లో మొదలు 

రూ.8,480 కోట్ల వ్యయంతో 17 కొత్త వైద్య కళాశాలలు 

వరుసగా మూడేళ్లలో అదనంగా 2,550 మెడికల్‌ సీట్లు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యకు మహర్దశ పట్టనుంది. వరుసగా మూడేళ్లలో 750, 750, 1,050 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వైద్య విద్యా రంగంలో విద్యార్థులకు విస్తృత అవకాశాలు కలగనున్నాయి. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.8,480 కోట్లు వ్యయం చేస్తోంది. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలల్లో అడ్మిషన్‌లు ప్రారంభం కానున్నాయి. 2024–25లో మరో ఐదు కళాశాలల్లో అకడమిక్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.   

యుద్ధ ప్రాతిపదికన.. 
రానున్న విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, రాజమండ్రిల్లో కొత్త వైద్య కళాశాలల అకడమిక్‌ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లోని జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దుతున్నారు. మచిలీపట్నం మినహా మిగిలిన నాలుగు చోట్ల ప్రీ–ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటిల్లో అకడమిక్‌ కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా వచ్చే ఏడాది రాష్ట్రంలో 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా సమకూరనున్నాయి.  

అదనపు భవనాలు, పడకలు 
2024–25లో అకడమిక్‌ కార్యకలాపాలు మొదలయ్యే వాటిల్లో పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని మెడికల్‌ కాలేజీ­లున్నాయి. పాడేరులో ఇప్పటికే 150 పడకల ప్రభుత్వాస్పత్రి ఉండగా మిగిలిన నాలుగు చోట్ల వంద పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రులున్నాయి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటే 330 పడకల సామర్థ్యం కలిగిన బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ క్రమంలో ఆయా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా తీర్చిదిద్ది అదనపు భవనాల నిర్మాణం, పడకల పెంపు చేపట్టనున్నారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలు 2025–26లో అకడమిక్‌ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయనున్నారు. 

చేరువలో స్పెషాలిటీ వైద్యం  
కొత్త వైద్య కళాశాలల్లో అకడమిక్‌ కార్యకలాపాలపై లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. వచ్చే విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలల్లో అకడమిక్‌ కార్యకలాపాలు మొదలవుతాయి. అనంతరం మరో ఐదు కళాశాలల్లో ప్రారంభించేలా కృషి చేస్తున్నాం. పెద్ద ఎత్తున వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్యతోపాటు ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేయడం సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం.  
– ఎం.టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి   

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top