పేదల ఆస్పత్రులకు కొత్త రూపు

New look for Govt hospitals In AP - Sakshi

అన్ని జిల్లాల్లోనూ ఊపందుకున్న పనులు

మొత్తం 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రుల్లో పనులు

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం

రూ. 1,223 కోట్లు వ్యయం.. రుణ సదుపాయం అందిస్తున్న నాబార్డు

నాణ్యతా ప్రమాణాలు చూసేందుకు ప్రత్యేక బృందం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల వైద్యానికి మంచి రోజులు మొదలయ్యాయి. అన్ని జిల్లాల్లోని వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులను పకడ్బందీగా తీర్చిదిద్దడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ. 1,223 కోట్ల అంచనా వ్యయంతో కొన్ని చోట్ల కొత్త భవనాలు నిర్మిస్తుండగా, మరికొన్ని చోట్ల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ మంది ఔట్‌పేషంటు సేవలు, ఇన్‌పేషంటు సేవలు అందిస్తున్నది వైద్య విధాన పరిషత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు (కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌), ఏరియా ఆస్పత్రులే. ఇక్కడ ఏడాదికి సగటున 2.30 కోట్ల మంది వైద్యం అందుకుంటున్నారు.

అందుకే అలాంటి ఆస్పత్రులను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు నాడు నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టింది. మొత్తం 165 పనులను 2022 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల పిల్లర్ల దశలో ఉండగా, కొన్నిచోట్ల మొదటి అంతస్తు స్లాబ్‌లు వేశారు. నెల్లూరు, కృష్ణా, వైఎస్సార్‌ జిల్లాల్లో పనుల వేగం మరింతగా పెరిగింది. ఈ పనులకు సంబంధించి నాబార్డ్‌ రుణ సాయం అందిస్తోంది. నిర్మాణాలు చేయడమే కాదు రెండు మూడు దశల్లో నాణ్యతా ప్రమాణాలు చూస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందం పనిచేస్తోంది. 

నిర్ణీత సమయంలోనే పూర్తి 
ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిర్ణీత సమయానికే పూర్తవుతాయి. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇవి అందుబాటులోకి వస్తే పేదలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. 
– అనిల్‌కుమార్‌ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ 

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రులు 
ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించడం సామాన్య విషయం కాదు. కొత్త భవనాలకు తగ్గట్టుగా వైద్యులను నియమించాం. నియోజకవర్గ స్థాయిలోనే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిధిలో వైద్యసేవలు అందుతాయి. 
– డా.యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధాన పరిషత్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top