
అబ్కారీ శాఖపై సమీక్షలో సీఎం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీకి రూపకల్పన చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఆయన అబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా, కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా వీటికి అనుమతులు ఇవ్వనున్నారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉప సంఘం నుంచి వచ్చింది.
కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజ్, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్‌కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధనను పెట్టనున్నారు. బార్ పాలసీలో గీత కులాలకు 10 శాతం బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని లిక్కర్ షాపుల్లో సేల్స్ పెరిగాయని, పొరుగు రాష్ట్రాల్లో సేల్స్ తగ్గాయని అధికారులు తెలిపారు. ఇప్పుడెవరూ అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడం లేదని చెప్పారు.