
ఈనెల 28 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
29, 30 తేదీల్లో సీట్ల కేటాయింపు
భారత విద్యా ప్రమాణాలకు తగ్గట్టుగాలేని విదేశీ వైద్య విద్యా సంస్థల్లో చేరొద్దు
చేరితే రిజిస్ట్రేషన్‌కు అనర్హులు
నేషనల్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరిక
సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ఆలిండియా కోటా మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రారంభించింది. నీట్ యూజీ–2025లో అర్హత సాధించిన విద్యార్థుల ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 28 వరకూ రిజిస్ట్రేషన్లకు గడువు విధించారు. విద్యార్థులు మంగళవారం నుంచి ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. 29, 30 తేదీల్లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం, డీమ్డ్, సెంట్రల్ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్మర్ విద్యా సంస్థల్లో సీట్లను ఆలిండియా కోటాలో భర్తీచేస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 475 సీట్లు ఆలిండియా కోటాలోకి వెళ్తాయి.
ఈ విదేశీ విద్యా సంస్థల్లో చేరొద్దు..
భారత్‌కు చెందిన విద్యార్థులు వైద్య విద్య కోసం బెలిజ్ దేశంలోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్, ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చిర్చిక్ బ్రాంచ్‌లలో చేరొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సూచించింది. ఈ విశ్వవిద్యాలయాలు భారత విద్యా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల లేమి, ఇతర సమస్యలను గుర్తించినట్లు భారత రాయబార కార్యాలయాలు నివేదించాయని ఎన్‌ఎంసీ తెలిపింది.
ఈ సలహాను పాటించకుండా ఆ విద్యా సంస్థల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు భారత్‌లో రిజిస్ట్రేషన్‌కు అనర్హులని తెలిపింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారు ఎంచుకున్న కళాశాలల్లో కోర్సు వ్యవధి, సిలబస్, కరికులమ్, క్లినికల్ శిక్షణ, ఇంటర్న్‌షిప్ వంటివి ఎన్‌ఎంసీ ప్రమాణాలకు లోబడి ఉన్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు.
దివ్యాంగ విద్యార్థులకు యూడీఐడీ తప్పనిసరి
నీట్ యూజీ–2025 అర్హత సాధించిన దివ్యాంగ విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక వైద్య గుర్తింపు కార్డు(యూడీఐడీ) తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి సోమవారం వెల్లడించారు. యూడీఐడీ లేని దివ్యాంగ విద్యార్థులు https:// swavlambancard.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని దగ్గరలోని ప్రభుత్వాస్పత్రిలో యూడీఐడీ పొందాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) సూచించిన విధంగా సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్‌ను విద్యార్థులు సమర్పించాలన్నారు. దానికి మెడికల్ అసెస్‌మెంట్ రిపోర్ట్–2025ను జత చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులందరూ విశ్వవిద్యాలయం సూచించిన మెడికల్ బోర్డ్ ముందు హాజరవ్వాల్సి ఉంటుందన్నారు.