ఏపీలో రైతుభరోసా కేంద్రాలతో సేవలన్నీ ఒకేచోట 

Narendra Singh Tomar On AP Rythu Bharosa Centres - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి జవాబు  

సాక్షి, న్యూఢిల్లీ: రైతులకు వన్‌–స్టాప్‌ పరిష్కారంలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుభరోసా కేంద్రాల గురించి కేంద్రానికి తెలుసని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. పరీక్షించిన వ్యవసాయ ఉత్పాదనల సరఫరా నుంచి వివిధ సేవలు, సామర్థ్యం పెంపు చర్యలు, సాగుకు సంబంధిం­చిన పరిజ్ఞానం ప్రచారం వంటి రైతుల అవసరాలన్నింటికీ ఒకేచోట పరిష్కారం అందించేలా ఈ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.

రాజ్యసభలో శుక్ర­వా­రం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చా­రు. అగ్రి–క్లినిక్స్, అగ్రి–బిజినెస్‌ సెంటర్స్, సాయిల్‌ హెల్త్‌కార్డ్‌ ఇలా పలు పథకాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు.  

ఖరీఫ్‌లో 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ  
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌లో ఈ నెల 11వ తేదీ వరకు 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు కేంద్ర వినియోగదారులు, ఆహారశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి.. వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వానీ ప్రశ్నకు సమాధానమిచ్చారు.  

జాతీయ సగటు కంటే ఏపీలోనే రైతు ఆదాయం ఎక్కువ  
జాతీయ సగటు కంటే నెలసరి రైతు ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు.   జాతీయ సగటు రూ.10,218 ఉండగా ఏపీలో రైతు నెలసరి ఆదాయం రూ.10,480 అని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top