మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ నోట తెలుగువారి ప్రస్తావన

Narendra Modi mention of Telugu people in Mann Ki Baat - Sakshi

విజయదుర్గ (ఏపీ), రాజకుమార్‌ (తెలంగాణ)లకు అభినందన

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో తెలుగువారి గురించి ప్రస్తావించారు. ఆదివారం 98వ మన్‌కీబాత్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, క్రీడలు తదితర అంశాల గొప్పదనం, పరిరక్షణకు చేస్తున్న సేవలు ప్రశంసించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలిపాటలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు.

దేశభక్తి గీతాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి.విజయ దుర్గ విజేతగా  ప్రకటించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో విజయదుర్గ దేశభక్తి గీతాన్ని రచించారని పేర్కొన్నారు. ‘‘రేనాడ ప్రాంత వీరా! ఓ వీర నరసింహా! భారత స్వాతంత్య్ర పోరాటానికి అంకురానివి! అంకుశానివి! ఆంగ్లేయుల అన్యాయమైన నిరంకుశ దమనకాండను చూసి మీ రక్తం మండింది మంటలు లేచాయి! రేనాడు ప్రాంత సూర్యుడా! ఓ వీర నరసింహా!’’ అనే దేశభక్తి గీతాన్ని  ఈ సందర్భంగా వినిపించారు.

మరో అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన పేరిణి రాజ్‌కుమార్‌ను అభినందించారు. కాకతీయుల కాలంలో మహాదేవుడు శివుడుకి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో పేరొందిందని, ఆ రాజవంశ మూలాలు ఇప్పటికీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాజకుమార్‌ నాయక్‌ ఒడిస్సీ నాట్యంలోనూ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వి.దుర్గాదేవి అనే మహిళ కరకట్టం అనే  పురాతన నృత్య విభాగంలో అవార్డు పొందారన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top