పుష్కలంగా విద్యుత్‌ 

Nagulapalli Srikanth and Sridhar says electricity Adequate supply to demand - Sakshi

రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా సరఫరా.. వ్యవసాయ, గృహ వినియోగానికి ఇబ్బంది లేదు 

ఉత్పత్తి కేంద్రాలు, బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో విద్యుత్‌..  వేసవిలో రేటు పెరిగినా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం 

పూర్తి సామర్థ్యంతో జెన్‌కో యూనిట్లు 

ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ పుష్కలంగా అందుబాటులో ఉందని, మూడు రోజులుగా ఎటువంటి విద్యుత్‌ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శనివారం ఆయన ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌తో కలిసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6,663 ఫీడర్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా కొద్ది సేపు అంతరాయం ఏర్పడితే ఆ సమయాన్ని అదే రోజు సర్ధుబాటు చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.9,717 కోట్లు సబ్సిడీ రూపంలో విడుదల చేసిందన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ మీటర్లు బిగిస్తామని, తొలుత శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
 
కోతలు లేకుండా చూస్తున్నాం 
► పరిశ్రమలకు, గృహ, వాణిజ్య అవసరాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చవక ధరలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. 2020లో 4,36,837 అంతరాయాలుంటే 2021లో వాటిని 2,02,496కు తగ్గించాం. 
► రాష్ట్రంలో రోజువారీ విద్యుత్‌ వినియోగం 204 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో  198 యూనిట్లు ఉండింది. ప్రస్తుత డిమాండ్‌లో 170 మిలియన్‌ యూనిట్ల వరకు ఏపీజెన్‌కో, కేంద్ర విద్యుత్‌ సంస్థలైన ఎన్‌టీపీసీ, నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్, న్యుక్లియర్‌ పవర్‌ ప్లాంట్స్, ప్రైవేటు పవర్‌ ప్లాంట్లతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా వస్తోంది.  
► మిగతా 34 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌ నుంచి రోజు, వారం, నెల వారీ బిడ్డింగ్‌ల ద్వారా తీసుకుంటున్నాం. ఈ మూడు మాసాల్లో మాత్రమే అదనపు డిమాండ్‌ ఉంటుంది. దీనికోసం దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం లేదు. 
► 700 నుండి 2000 మెగావాట్ల వరకు ప్రతి పావుగంటకు మార్కెట్‌లో ఆక్షన్‌ ద్వారా అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా పాల్గొని నిర్ధారణ అయిన రేట్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. విద్యుత్‌ వినియోగించే సమయాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని రైతుల పంపు సెట్లకు, గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. 
► విద్యుత్‌ కొనుగోలు చెల్లింపులకు సంబంధించి గత ఏడాది నుంచి కేంద్రం నిబంధనలను కఠిన తరం చేసినందున అడ్వాన్సుగా చెల్సించాల్సి వస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల నుండి పెద్ద ఎత్తున నిధులను విద్యుత్‌ అవసరాలకు కేటాయిస్తోంది. ఎన్టీపీసీ విషయంలో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సమస్య ఉత్పన్నమైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆ సమస్యను పరిష్కరించాయి.  
► ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ సీఈఓ ఎ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. 
  
బొగ్గు సమస్య లేదు 
ఏపీ జెన్కోకు సంబంధించి విజయవాడ, కృష్ణపట్నం, రాయసీమలో మూడు థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు ఉన్నాయి.  వీటి ద్వారా సుమారు 5,010 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందులోని మొత్తం 15 యూనిట్లు ఫంక్షనింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 80 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం రోజుకు 60 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. బొగ్గు సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. 
– బి.శ్రీధర్, ఏపీ జెన్కో ఎండీ     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top