‘ప్రజా సంకల్ప యాత్ర’పై దేవిశ్రీ పాట

Muthamsetti Srinivasa Rao Was Released Song On Praja Sankalpa Yatra - Sakshi

సీతమ్మధార (విశాఖ ఉత్తర): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా గాయకుడు దేవిశ్రీ రచించి, పాడిన పాటను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. ‘ఆకలన్నోడికి అన్నం పెట్టే వైఎస్‌ జగనన్నో.. నీకు పేదలు అండగ ఉన్నారన్నో..’ అంటూ సాగిన గీతాన్ని మంత్రి ఆదివారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాకవి శ్రీశ్రీ నుంచి వంగపండు వరకు ఎందరో మహానుభావులు ఇక్కడి వారు కావడం మన అదృష్టమన్నారు.

ఆ కోవకు చెందిన మరో గొప్ప కవి దేవిశ్రీ అని కొనియాడారు. ప్రభుత్వం కళాకారులకు అండగా ఉంటుందన్నారు. గుంటూరులో గుర్రం జాషువా స్మారక చిహ్నం నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు దేవుడయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే బాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్లు ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top