పోలవరం ప్రాజెక్టు వద్ద.. అంతర్జాతీయ ప్రమాణాలతో మ్యూజియం

Museum At Polavaram Project Archaeologists Design Of Proposals - Sakshi

ప్రతిపాదనల రూపకల్పనలో పురావస్తు శాఖాధికారులు

ప్రతిపాదనల రూపకల్పనలో పురావస్తు శాఖాధికారులు

ముంపు గ్రామాల్లో క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్లనాటి ఆదిమ మానవ సంస్కృతి

ఒకప్పుడు ఉత్తర, దక్షిణ భారతదేశ వర్తక వాణిజ్యానికి వారధి

భావి తరాలకు ముంపు గ్రామాల సంస్కృతులు

సాక్షి, అమరావతి : చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే పాత పురావస్తు భవనాలను ఆధునీకరించడంతో పాటు కొత్త మ్యూజియాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోని రామన్నగూడెంలో సుమారు రెండెకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మ్యూజియాన్ని నిర్మించనుంది. ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. 

వృత్తి నైపుణ్యానికి ప్రతీక..
గతంలో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో.. ఆదిమ మానవులు అలంకరణలో వినియోగించిన టెర్రకోట పూసలు (బంక మన్నుతో చేసిన పూసలు).. రాతి, దంతపు పూసలతో పాటు కుండలు, ఇనుప గొడ్డలి, కొడవలి, పొట్టేలు బొమ్మ తలను గుర్తించారు. ఇక్కడ లభించిన బ్లాక్‌ అండ్‌ రెడ్‌ వేవ్‌ కుండల (కుండ పైభాగం ఎరుపు, కింద భాగం నలుపు) తయారీ (కాల్చే విధానం) ఆనాటి మానవుల వృత్తి నైపుణ్యానికి అద్దంపడుతోందని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యంగా పూసల తయారీ, ఇనుప పనిముట్లను రూపొందించడంతో పాటు మట్టి కుండలపై గ్రాఫిటి గుర్తులు, బ్రాహ్మి అక్షరాలు వారిని వృత్తి నిపుణులుగా రుజువు చేస్తున్నాయి.

ముంపు గ్రామాల సంస్కృతికి ప్రతీకగా..
పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవనాడి. అంతటి ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఒకప్పుడు ఆదిమ మానవ సంస్కృతి విరాజిల్లింది. వేల సంవత్సరాల కిందటే వారు గొప్ప జీవన విధానాన్ని అవలంబించారు. ఆనాటి గుర్తులు, వస్తువుల సమాహారంతో ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముంపు గ్రామాల సంస్కృతిని భావితరాలకు అందించేందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. – జి. వాణిమోహన్,  కమిషనర్, రాష్ట్ర పురావస్తు శాఖ

క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల క్రితం..
ఆదిమ కాలం నాటి (మెగాలిథిక్‌) మానవుని ఆనవాళ్లు, జీవన విధానానికి పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట, తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలంలోని రాయనపేటలో గతంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ద్వారా సామాజిక, సంస్కృతి, జీవన విధానంలో ఈ ప్రాంతం ఎంతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉత్తర, దక్షిణ భారతదేశ వర్తక వాణిజ్యానికి వారధిగా నిలిచినట్లు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తర భారతదేశంలోని డెక్కన్‌ ప్రాంతంలో ఉత్పత్తి అయి ప్రత్యేక అలంకరణలో వినియోగించే రాళ్లను ఇక్కడి తవ్వకాల్లో గుర్తించడం విశేషం. ఈ క్రమంలోనే క్రీస్తుపూర్వం మూడువేల సంవత్సరాల కిందటి మానవుల జీవనాన్ని ప్రతిబింబించేలా మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్నారు. పురావస్తు శాఖాధికారులు ప్రాజెక్టుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో సర్వే నిర్వహించి సుమారు 500 విగ్రహాలను గుర్తించి వాటి సమగ్ర వివరాలను నమోదు చేశారు. వీటిని మ్యూజియంలో భద్రపరచనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top