రెండ్రోజుల్లో అందరినీ తీసుకొస్తాం

MT Krishnababu about Andhra Pradesh Students At Ukraine - Sakshi

ఉక్రెయిన్‌లో మొత్తం 615 మంది ఆంధ్రప్రదేశ్‌ 

విద్యార్థులు ఉన్నట్లుగా గుర్తించాం

ఇప్పటివరకు ఐదు విమానాల ద్వారా 32 మందిని క్షేమంగా తీసుకొచ్చాం 

మార్చి 2లోగా మొత్తం విద్యార్థుల తరలింపు 

ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు  

సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ రెండ్రోజుల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఈ విషయమై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థుల వివరాలను సేకరించింది. కంట్రోల్‌ రూమ్, హెల్ప్‌లైన్, కన్సల్టెన్సీల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌లో రాష్ట్రానికి చెందిన 615 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కతేలిందని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. వీరితోపాటు వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడామని.. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ గంగ’ పేరుతో ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక విమానాల్లో వీరందరినీ స్వదేశానికి తీసుకువస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటనలో తెలిపారు.

వీరిని ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల నుంచి ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఏపీకి తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చెందిన 32 మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని కూడా మార్చి రెండులోగా తీసుకురానున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. ఇక ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను పోలండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లొవేకియా దేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ సహకారంతో ఆయా దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల సహకారంతో విద్యార్థులకు అవసరమైన వసతి, భోజనం  ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

5 వర్సిటీల్లోనే అధికంగా విద్యార్థులు
రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని 14 విశ్వవిద్యాలయాల్లో చేరారని.. ఇందులో అత్యధికంగా ఐదు విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నారని కృష్ణబాబు పేర్కొన్నారు. మరోవైపు.. దక్షిణ ఉక్రెయిన్‌ ప్రాంతంలో ఉన్న జఫోరియా స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ చుట్టపక్కలే స్వల్పంగా బాంబుదాడులు జరిగినట్లు తేలిందని కృష్ణబాబు తెలిపారు. అలాగే, కైవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ యూఏఎఫ్‌ఎం, ఓడెస్సా నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీ, ఖార్‌కివ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీ, విన్‌టెసా ఓఓ బోగోమోలెట్స్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులు అధికంగా ఉన్నారన్నారు. ఇక విశాఖపట్నం నుంచి 95 మంది, కృష్ణా జిల్లా నుంచి  89 మంది, తూర్పు గోదావరి నుంచి 70 మంది విద్యార్థులు వెళ్లగా, అత్యల్పంగా విజయనగరం నుంచి 11 మంది, శ్రీకాకుళం నుంచి 12, కర్నూలు నుంచి 20 మంది వెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top