
అజిత్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన టాస్‌్కఫోర్స్
నెల్లూరు జిల్లా: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కీలక వ్యక్తి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన నల్లపరెడ్డి అజిత్‌కుమార్‌రెడ్డిని సోమవారం ఎర్రచందనం టాస్‌్కఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం దూబగుంటలో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూముల్లోని అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను అజిత్‌కుమార్‌రెడ్డి, లంకా వినోద్‌కుమార్‌రెడ్డి, కార్పెంటర్ శ్రీహరి అతని కుమారుడు నిరంజన్‌తో పాటు మరికొందరు కలిసి నరికారు.
రవాణాకు వీలుగా ఆ దుంగలను మూడడుగుల పొడవు, అడుగు వెడల్పుతో కోయించారు. దుంగలను కొన్ని కరేడు, మరికొన్ని బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప ప్రాంతంలో దాచారు. గత నెల 17న చెన్నైకు తరలిస్తుండగా తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో వినోద్‌కుమార్‌రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ అక్రమ రవాణాలో అజిత్‌కుమార్‌రెడ్డి కీలకంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ కేసును వైఎస్సార్‌సీపీ మెడకు చుట్టేందుకు తప్పుడు ప్రచారం చేసి భంగపడ్డారు.
అటవీ, పోలీసు శాఖల అధికారులు కరేడు ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ప్రధానంగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు గ్రామంలోనే ఉండి కేసులో కీలక వ్యక్తులపై ఆరా తీశారు. ఈ క్రమంలో కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐ ఉమాశంకర్ ఆధ్వర్యంలో టాస్‌్కఫోర్స్ బృందం అజిత్‌రెడ్డితో పాటు, శ్రీహరి, అతని కుమారుడు నిరంజన్‌ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఎన్నికల ప్రచారంలో అజిత్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది.