తల్లిని చంపిన కోరిక! | Vizianagaram Teen Boy And Friend Arrested In Brutal Mother Murder Case Inspired By Online Mafia Content In Rajam | Sakshi
Sakshi News home page

తల్లిని చంపిన కోరిక!

May 16 2026 10:20 AM | Updated on May 16 2026 12:34 PM

Mother And Son Incident In Vizianagaram

విజయనగరం: నవమాసాలు కని పెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్‌ఫోన్‌లో వచ్చే కిల్లర్‌ యానిమేషన్, డాన్‌ ఫిల్‌్మలకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు. వాటికి తోడు తల్లి పెట్టిన ఆంక్షలు తట్టుకోలేకపోయాడు. మరో స్నేహితుడి సాయం తీసుకుని తల్లినే హతమార్చాడు. ఇవీ రాజాం పట్టణం డోలపేటలో ఈనెల 4న జరిగిన స్పందన హత్యకేసు ఘటన వివరాలు. పదిరోజుల అనంతరం పోలీసులు కేసు ఛేదించి తల్లి హత్యకు కారణమైన కుమారుడిని, స్నేహితుడిని పట్టుకుని రాజాం పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఈ నెల 4న డోలపేటలో స్పందన అనుమానాస్పద హత్యకు గురైంది. హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కుమారుడిపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నారు.  పదో తరగతి పరీక్షల్లో 525 మార్కులు సాధించిన స్పందన కుమారుడు సెల్‌ఫోన్‌లో యానిమేషన్‌ ఫిల్‌్మకు ఆకర్షితుడయ్యాడు. బాగా చదవాలని, సెల్‌ఫోన్‌ వినియోగించరాదని తల్లి బుద్ధులు చెప్పడంతో పాటు బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుని రావాలని, పెద్దలతో మర్యాదగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రూల్స్‌ పెట్టింది. వాటికి తోడు కుమారుడి వద్ద ఉన్న లెటర్స్, పుస్తకాలు తరచూ తనిఖీ చేస్తుండేది.  ఈ కట్టుబాట్లకు ఆ యువకుడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఒక లెటర్‌ రాసుకున్నాడు. 

ఆ విషయం తల్లికి తెలిసిపోయి మందలించింది. దీంతో మరింత మనస్తాపానికి గురై    స్నేహితుల వద్ద మా అమ్మ నన్ను టార్చర్‌ చేస్తోందని, ఇల్లు వదిలి బయటకు వెళ్లి డాన్‌గా మారాలని చెప్పేవాడు. అదే సమయంలో డోలపేట సమీపంలోని గ్రామానికి చెందిన  మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కూడా ఇలానే ఆలోచించడం, ఇంటర్‌పరీక్షలు ఇటీవల రాయకుండా వదిలేయడం, ఇంటి వద్ద తండ్రి మందలించడంతో బయట తిరగడం చేసేవాడు. వ్యవస్థపై విసుగుచెంది కోపం పెంచుకోవడంతో పాటు  ముంబై వంటి ప్రాంతాల్లో మాఫియాలో చేరాలని ఆ యువకుడు కూడా అనుకునేవాడు.  దీంతో వారిద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో  ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో స్పందన కుమారుడు మా అమ్మని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. తాను కూడా మాఫియాలో చేరాలని అనుకున్నాడు. దీనికి పథకం వేసుకున్నారు.

 అక్కడి నుంచి అనుకున్న పథకం ప్రకారం ఈనెల 4న స్పందన ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమె ఇంట్లో లేదు. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే బాత్‌రూమ్‌కి వచ్చి కాళ్లు కడుక్కుంటుందని అని చెప్పడంతో అతని స్నేహితుడు బాత్‌రూమ్‌లో దాక్కున్నాడు. వారు అనుకున్నట్లే ఆమె ఇంటికి వచ్చి బాత్‌రూమ్‌లో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లింది. అప్పటికే అక్కడే ఉన్న స్నేహితుడు ఆమె మెడపట్టుకుని కిందపడిపోయాడు. అరుస్తున్న ఆమె నోటిని రెండో చేతితో గట్టిగా మూశాడు. ఆమె ఆ యువకుడి చేతిని కొరికినా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు. చనిపోయిందని అనుకుని వదిలేశారు. అయినా ఆమెలో కదలికలు రావడంతో ఇద్దరూ ఇంట్లో ఉన్న కత్తులతో దాడిచేశారు. 

బాత్‌రూమ్‌లో రక్తాన్ని కడిగేసిన తరువాత చీరలో అమెను చుట్టి ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరపడేశారు. వారు ధరించిన బట్టలు, కత్తులు సైతం ఎవరికీ కనిపించకుండా విసిరేశారు. అనంతరం వారిద్దరూ ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5వేలు నగదు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి నుంచి పలాస, విశాఖపట్నం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లలో సిమ్‌లు పడేసి అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌కు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా మెసేజ్‌లు చేసేవారు. అలా ఇన్‌స్టా గ్రామ్‌ మెసేజ్‌ ద్వారా వారిద్దరూ తిరుపతిలో ఉన్నట్లు రాజాం పోలీసులు కనిపెట్టి తిరుపతి పోలీసుల సహాయంతో నిందితులిద్దరినీ పట్టుకుని వారి వద్ద ఉన్న బంగారం కడియం, కత్తులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ  జువైనల్‌ హోమ్‌కు తరలించనున్నామని డీఎస్పీ పేర్కొన్నారు.

మాఫియాకు ఆధారాలు చూపించాలనే..
సంవత్సరం క్రితం పరిచయమైన వారిద్దరూ మాఫియాలో చేరాలని నిర్ణయించుకుని, జపాన్‌ యానిమేషన్‌లు తరచూ చూస్తూ వాటిని అనుకరించారు. దీంతో వాటికి ఆకర్షితులై వారిలా మాఫియా డాన్‌లు కావాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన తల్లిని చంపిన తరువాత వారిని పోలీసులు వెతికిన ఆధారాలు చూపిస్తే మాఫియాలో జాయిన్‌ చేసుకుంటారనేది రెండో బాలుడు చెప్పిన అంశమని డీఎస్పీ తెలిపారు. 

పిల్లల ప్రవర్తనపై దృష్టిసారించాలి..
ఇంట్లో  చిన్నారుల కదలికలతోపాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని డీఎస్పీ రాఘవులు అన్నారు. ఎక్కువగా సెల్‌ఫోన్లకు అలవాటుపడిన పిల్లలు ఏం చేస్తున్నారు? వారి ఫ్రెండ్స్‌ ఎవరు? సోషల్‌ మీడియాలో వారి పాత్ర ఏమిటి వంటి వాటిని  గ్రహించాలని హితవు పలికారు. ఇలా వారిపై దృష్టిసారిస్తే తీవ్రమైన నేరాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. సమావేశంలో టౌన్, రూరల్‌ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్‌.ఉపేంద్ర, ఎస్సై సల్మాన్‌ బేగ్‌లు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement