పెద్దల సభ చైర్మన్‌గా కొయ్యే మోషెన్‌ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక 

Moshen Raju Elected As AP Council Chairman Unanimously - Sakshi

సాదరంగా తోడ్కొని కుర్చీలో కూర్చోబెట్టిన సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేతలు 

రాజకీయ నేపథ్యం లేని దళిత వ్యక్తి ఈ పదవిలో కూర్చోవడం ఆనందం: సీఎం జగన్‌ 

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి దళిత వ్యక్తికి అత్యున్నత పదవి ఇచ్చారంటూ కొనియాడిన సభ్యులు 

ప్రమాణ స్వీకారానికి దూరంగా టీడీపీ.. దళితులపై టీడీపీ చిన్న చూపునకు ఇదే నిదర్శనమన్న సభ్యులు

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల చట్ట సభల్లో సరికొత్త అధ్యాయానికి రాష్ట్ర శాసన మండలి తెరతీసింది. పెద్దల సభగా పిలుచుకునే మండలి చైర్మన్‌ పీఠంపై తొలిసారిగా దళిత వ్యక్తి ఆసీనులయ్యారు. శుక్రవారం జరిగిన మండలి సమావేశంలో శాసన మండలి చైర్మన్‌గా కొయ్యే మోషేన్‌ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని గంగుల ప్రభాకర్‌ రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాసరావు, బల్లి కల్యాణ చక్రవర్తి బలపర్చారు.

రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు  ప్రొటెం చైర్మన్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రకటించారు. రాజును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు తోడ్కొనివచ్చి చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక సామాన్య దళిత రైతు కుటుంబం నుంచి మోషేన్‌ అన్న వచ్చారు.

అతి చిన్న వయసులోనే భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇవాళ శాసన మండలి చైర్మన్‌ స్థాయికి ఎదిగారు. మోషేన్‌ రాజుకు హృదయపూర్వక అభినందనలు. మోషేన్‌ రాజు నాన్నగారి సమయం నుంచి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా క్రియాశీలకంగా పనిచేశారు. పదేళ్లుగా నాతోనే ఉన్నారు. ఇవాళ మండలి చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషం కలిగిస్తోంది’’ అని చెప్పారు.

కార్యక్రమానికి దూరంగా టీడీపీ!
తొలిసారిగా పెద్దల సభ చైర్మన్‌గా దళిత వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని ప్రధాన ప్రతి పక్ష పార్టీ బహిష్కరించింది. టీడీపీ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. దళిత వ్యక్తి మండలి చైర్మన్‌ అవుతున్న కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిన ప్రతిపక్ష టీడీపీ ఒక దుష్ట సంప్రదాయానికి తెరతీసిందని మండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ విమర్శించారు.  దేశంలోని దళితులంతా రాష్ట్రం వైపు చూస్తున్న ఇటువంటి కార్యక్రమంలో టీడీపీ పాల్గొనకపోవడం దురదృష్టకరమని మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు.  

సాహసోపేత నిర్ణయం : మోషేన్‌ రాజు
మోషేన్‌ రాజు మాట్లాడుతూ... పేద, వ్యవసాయ, దళిత కుటుంబానికి చెందిన తనను మండలి చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో పైకి రావాలంటే డబ్బు, కులం, రాజకీయ నేపథ్యం అవసరమని అందరిలానే తానూ భావించే వాడినని చెప్పారు. ఈ పదవి వచ్చిన తర్వాత అవన్నీ అవసరం లేదని.. విశ్వాసం, నమ్మకం, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే చాలని అర్థమైందని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని.. దాని అర్థం ఇప్పుడు అర్థమయ్యిందని అన్నారు. తనను మండలి సభ్యుడిని చేయడంతో పాటు చైర్మన్‌ పదవి కూడా ఇచ్చారని తెలిపారు. జగన్‌ తప్ప మరెవరూ ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేరని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో ప్రతిపక్షాలకు ఒక వంతు ఎక్కువే అవకాశం ఇస్తానని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి మాట్లాడాలని ఆయన సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top