మిల్లెట్స్‌తో మెరిసిన చిత్రాలు 

Moka Vijaykumar creates photographs differently - Sakshi

చిరు ధాన్యాలతో ప్రధాని మోదీ, సీఎం జగన్, పారిశ్రామిక దిగ్గజాల చిత్రాలు

విశాఖ (ఏయూ క్యాంపస్‌): గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పలువురి పారిశ్రామిక దిగ్గజాల ఛాయాచిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవన్నీ చిరుధాన్యాలతో తీర్చిదిద్దినవి కావడమే ఇక్కడ విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలపై ప్రజల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్‌ విభిన్నంగా ఛాయాచిత్రాలను రూపొందించారు.

భారతీయ రైల్వేలో టెక్నీషియన్‌–1గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చిరుధాన్యాలతో దేశం గర్వించే నాయకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తల చిత్రాలను తయారు చేశారు. జీఐఎస్, జీ–20 సదస్సులలో ప్రదర్శించడంతో పాటు ప్రముఖులకు, పారిశ్రామిక దిగ్గజాలకు వాటిని బహూకరించే విధంగా నెలల పాటు శ్రమించారు. జొన్నలు, గంట్లు, అరికలు, రాగులు, నల్ల నువ్వులు వంటి వాటితో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లా, అంబానీ, అదానీ, ఆనంద్‌ మహీంద్రా తదితరుల చిత్రాలను రూపొందించారు.

ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారిలకు గురువారం ఈ చిత్రాలను విజయ్‌కుమార్‌ చూపించారు. జీఐఎస్‌కు విచ్చేసే అతిథులు, ప్రముఖులకు వీటిని బహూకరించాలని కోరారు. వీటిని పరిశీలించిన మంత్రి అమర్‌నాథ్‌ చిత్రకారుడు విజయ్‌కుమార్‌ను అభినందించారు. వీటిని శుక్రవారం జరిగే సమ్మిట్‌లో హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు బహూకరిస్తామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top