స్విమ్స్ ఘటనపై మంత్రి ఆళ్ల నాని సీరియస్‌‌

Minister Alla Nani Serious On Svims Building Roof Collapse Incident - Sakshi

సాక్షి, అమరావతి: తిరుపతి స్విమ్స్‌ శ్రీ పద్మావతి కోవిడ్ హాస్పిటల్ ప్రమాదంలో మృతి చెదిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అదే విధంగా ప్రమాదంలో మృతి చెందిన రాధిక కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. గాయపడిన రాజా, నాగరత్నమ్మలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన తీరుపై తక్షణమే స్పందించిన మంత్రి.. తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నుంచి ప్రమాద వివరాలను ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సీరియస్‌ అయిన మంత్రి గాయపడిన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన ప్రిన్సిపాల్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డితో ఫోన్‌ మాట్లాడి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై వెనువెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ హెచ్‌ఎంఐడీసీ ఎండీ చంద్ర శేఖర్‌రెడ్డిని ఆదేశించారు. 

తిరుపతి స్విమ్స్ మొదటి అంతస్తులో కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్విమ్స్ డైరెక్టర్లకు సూచించారు. స్విమ్స్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనం మొదటి బ్లాక్‌లోకి వస్తున్న సమయంలో కరోనా పేషెంట్లకు గాయాలు అయ్యాయని చెప్పారు. ఆకస్మికంగా పెచ్చులు ఊడి పడటంతో ప్రమాదం జరిగిందని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా బాద్యులు అని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top