నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళ  | Sakshi
Sakshi News home page

నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళ 

Published Mon, Apr 24 2023 3:04 AM

Men and Women in the country  2022 report revealed - Sakshi

సాక్షి, అమరావతి  :  రాష్ట్రంలో మహిళలు తిరుగులేని శక్తిగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా వారికే పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్ణయాత్మక స్థానాలు, కీలకమైన పదవుల్లో ఏపీ మహిళలది దేశంలోనే అగ్రస్థానం. కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ ‘భారతదేశంలో వివిధ రంగాల్లో మహిళలు, పురుషులు–2022’ అనే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

నివేదిక ముఖ్యాంశాలు ఇవే..
♦ 
సాధారణ హోదా, సీనియర్‌ అధికారులు, మేనేజర్లు, శాసనసభ్యుల హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడంతో దేశ సగటుతో పాటు దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు.  
సీనియర్‌ అధికారులు, మేనేజర్లు, ఎమ్మెల్యేల వంటి నిర్ణయాత్మక పదవుల్లో రాష్ట్ర మహిళల హవా కొనసాగుతోంది. 
 శాసనసభ్యులు, సీనియర్‌ అధికారులు, మేనేజర్ల హోదాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 22.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది అత్యధికంగా 43.4 శాతం ఉంది. 
 సీనియర్, మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 18.1 శాతం ఉండగా ఏపీలో 30.3 శాతం ఉంది. మరే ఇతర పెద్ద రాష్ట్రాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఏపీలో ఉన్నంత స్థాయిలో లేదు.  
 మొత్తం కార్మికుల్లో మేనేజర్‌ హోదాలో ఏపీలో 30.4 శాతం మహిళలే ఉండగా ఇదే దేశం మొత్తం చూస్తే కేవలం 18.0 శాతమే.  
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్‌ సంస్థల్లో 50 శాతం మంది మహిళలు (78,025 మంది) ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.  
అదే సాధారణ కార్మికులు, నిర్ణయాత్మక హోదాల్లోనూ, శాసనసభ్యులు, సీనియర్‌ అధికారులు, మేనేజర్ల స్థాయిలో మహిళల భాగస్వామ్యం బీహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉంది.  
 సమాజంలో సగభాగమైన మహిళలకు ఆంధ్రప్రదేశ్‌ ప్ర­భుత్వం అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. 
మంత్రిమండలితో పాటు స్థానిక సంస్థల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నామినేటెడ్‌ పద­వు­లు, నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చట్టాలు చేసింది.  
 అంతేకాక.. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలిస్తే వాటిని మహిళల పేరు మీదే పంపిణీ చేశారు. సాధారణ హోదాలోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువమంది మహిళలున్నారని.. వీరంతా నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నట్లు నివేదిక వెల్లడించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement