విజయమే ఇంటిపేరు.. విజయదుర్గ మరో ఘనత | Meesala VijayaDurga TS LAWCET 2026 Toppers | Sakshi
Sakshi News home page

విజయమే ఇంటిపేరు.. విజయదుర్గ మరో ఘనత

Jun 6 2026 11:21 AM | Updated on Jun 6 2026 11:35 AM

Meesala VijayaDurga TS LAWCET 2026 Toppers

తెలంగాణ లా–సెట్‌లో స్టేట్‌ ఫస్ట్‌ 

ఇటీవల గ్రూప్‌–2 పరీక్షలోనూ విజయం

డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం

నెల్లిమర్ల యువతి అరుదైన ఘనత 

నెల్లిమర్ల రూరల్‌: ఎక్కడో మారుమూల గ్రామం.. సాధారణ రైతు కుటుంబం..ప్రభుత్వ పాఠశాలలోనే చదువు..కానీ అసాధారణమైన లక్ష్యాలు, అచంచలమైన పట్టుదల విజయనగరం జిల్లా యువతి మీసాల విజయదుర్గను తెలంగాణ లా–సెట్‌లో తొలి ర్యాంక్‌ సాధించేలా చేశాయి. నెల్లిమర్ల మండలం ఆత్మారాముని అగ్రహారం గ్రామానికి చెందిన విజయదుర్గ గురువారం విడుదలైన తెలంగాణ లా–సెట్‌ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకుంది. తండ్రి మీసాల వెంకట్రావు రైతు కాగా, తల్లి రామలక్ష్మి  గృహిణి. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం ఆమె విజయానికి బలమైన పునాది అయింది. 

ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం
రామతీర్థం ఉన్నత పాఠశాలలో చదివిన విజయదుర్గ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది. పదోతరగతిలో 568 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొంది అక్కడే ఆరేళ్లు  బీటెక్‌ విద్యను పూర్తి చేసింది. చదువు అనంతరం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి ఐదేళ్ల పాటు ఆ రంగంలో పనిచేశారు. ఉన్నత లక్ష్యాలే  ముఖ్యమని భావించిన విజయదుర్గ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రూప్‌–2కు సన్నద్ధమయ్యారు. 

గ్రూప్‌–2లో సత్తా..డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం..
పట్టుదలతో కష్టపడి చదువుకున్న విజయదుర్గ 2023 ఏపీపీఎస్పీ  గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ పరీక్ష రాశారు. ఇటీవల ఆ ఫలితాలు విడుదల కాగా ఉత్తమ ప్రతిభ కనబరిచి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత కూడా చదువును కొనసాగించి న్యాయవృత్తిపై ఉన్న ఆసక్తి కారణంగా తెలంగాణ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2026 పరీక్షకు హాజరై రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ ర్యాంకు సాధించారు. పోటీ తీవ్రంగా ఉన్న పరీక్షలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఆమె విజయం ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. సరైన లక్ష్యం, కృషి ఉంటే ఏ నేపథ్యం నుంచైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విజయదుర్గ నిరూపించారు.

న్యాయమూర్తిగా సేవలందించడమే లక్ష్యం
నా విజయ ప్రస్థానంలో తల్లిదండ్రులు వెంకట్రావు, రామలక్ష్మి ప్రోత్సాహంతో పాటు కాబోయే జీవిత భాగస్వామి శ్రావణ్‌ కుమార్‌ పటేల్‌ కృషి దాగి ఉంది. శిక్షణలో గురువుగా, మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపిక కావడంతో పాటు టీజీ లాసెట్‌ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రజాసేవతో పాటు న్యాయరంగంలోనూ విశిష్ట స్థానాన్ని సంపాదించి, సమాజానికి ఉపయోగపడే న్యాయమూర్తిగా ఎదిగి ప్రజాసేవకు అంకితమవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. 
–మీసాల విజయదుర్గ

 

Advertisement
 
Advertisement
Advertisement