టెన్త్‌ ‘స్పాట్‌’.. తప్పులతడక | Massive errors in 10th grade evaluation | Sakshi
Sakshi News home page

టెన్త్‌ ‘స్పాట్‌’.. తప్పులతడక

Apr 24 2026 4:27 AM | Updated on Apr 24 2026 4:27 AM

Massive errors in 10th grade evaluation

జిల్లాలకు భారీగా సవరణ జాబితాలు

పార్ట్‌–2కు భిన్నంగా పార్ట్‌–3లో మార్కుల నమోదు.. టీచర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లకు తాఖీదులు 

అస్తవ్యస్తంగా ఎస్సెస్సీ–2026 మూల్యాంకనం 

అగమ్యగోచరంగా విద్యార్థుల భవితవ్యం 

ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుందని అంచనా

సాక్షి, అమరావతి : ఈ ఏడాది పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది. ఇటీవల ముగిసిన స్పాట్‌ వాల్యుయేషన్‌లో భారీగా తప్పులు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కుల నమోదు తప్పులతడకగా జరిగినట్లు తెలిసింది. పార్ట్‌–2లో నమోదుచేసిన మార్కులకు భిన్నంగా పార్ట్‌–3లో నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ట్యాబ్‌లతో మార్కులను ఆన్‌లైన్‌ చేయగా ఈ విధానం విఫలమవడంతో రాష్ట్ర పరీక్షల డైరెక్టరేట్‌ మళ్లీ మాన్యువల్‌గా స్కానింగ్‌ విధానం చేపట్టింది. 

ఈ క్రమంలో మార్కుల నమోదులో జరిగిన తప్పులు పెద్దఎత్తున బయటపడుతున్నాయని, దాంతో ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉపాధ్యాయులకు నోటీసులు పంపుతున్నట్లు తెలిసింది. గతేడాది గొప్పలకు పోయి విద్యార్థుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన పరీక్షల విభాగం.. ఈ ఏడాది అంతకంటే ఘోరమైన తప్పిదాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 6.20 లక్షల మంది విద్యార్థుల ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. 

పార్ట్‌–2, 3లో భిన్నంగా మార్కులు..
మూల్యాంకనంలో ఆన్సర్‌షీట్‌ పైన ఓఎంఆర్‌ షీట్‌ ఉంటుంది. ఇందులో విద్యార్థి వివరాలతో పాటు మార్కులు  నమోదుచేస్తారు. అలాగే, ఓఎంఆర్‌ షీట్‌లోని పార్ట్‌–2లో ప్రశ్నల వారీగా మార్కులను అక్కడే గ్రాండ్‌ టోటల్‌ చేస్తారు. అనంతరం పార్ట్‌–3లో అవే మార్కులను నమోదుచేసి పెన్సిల్‌తో బబ్లింగ్‌ చేసి అసిస్టెంట్‌ ఎగ్జామినర్, స్పెషల్‌ అసిస్టెంట్, చీఫ్‌ ఎగ్జామినర్‌ సంతకాలు చేస్తారు. అయితే, ఇక్కడే అనేక తప్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఉదా.. ఒక సబ్జెక్టులో పార్ట్‌–2లో 75 మార్కులు నమోదుచేసి, పార్ట్‌–3లో మాత్రం 57 వచ్చినట్లు నమోదుచేశారు. 

అలాగే, 89 మార్కులకు 67, 90 మార్కులకు 60, 70 మార్కులకు 94, 62 మార్కులకు 88.. ఇలా నమోదైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో తప్పు మార్కులు నమోదుచేసిన ఉపాధ్యాయులకు, స్పెషల్‌ అసిస్టెంట్లకు రాష్ట్ర పరీక్షల విభాగం తాఖీదులు పంపుతోంది. వారిచ్చే సమాధానం ఆధారంగా సవరణ చేయాల్సి ఉంటుంది. అలాగే, జిల్లాలకు భారీగా సవరణ జాబితాలు పంపుతున్నారు. సాధారణంగా ఏటా ఈ తరహా పొరపాట్లు చాలా స్వల్పంగా జరుగుతాయి. కానీ, ఈసారి భారీగా జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. 

టార్గెట్‌ పెట్టి మరీ టీచర్లపై ఒత్తిడి..
ఈ ఏడాది టెన్త్‌ విద్యార్థుల ఉత్తీర్ణత ఆధారంగానే ఉపాధ్యాయుల పనితీరును మదింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవార్డులకు కూడా దీనినే ప్రాతిపదికగా తీసుకుంటామని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తెలిపింది. దీంతోపాటు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించకున్నా, తక్కువ ఉత్తీర్ణత వచ్చినా ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులదే బాధ్యతని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో.. ఈసారి భారీగా కాపీయింగ్‌ జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే, మూల్యాంకనంలో పాల్గొనాలంటే కనీసం మూడేళ్ల ‘స్పాట్‌’ అనుభవం ఉండాలి. కానీ, ఈసారి బోధన చేయని ఉపాధ్యాయులతోనూ మూల్యాంకనం చేయించారు. దీంతో మార్కుల నమోదులో పెద్దఎత్తున తప్పులు వెలుగుచూస్తున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement