ప్రేమికుల దినోత్సవం రోజున 36 జంటలకు పెళ్లి

Mass Weddings For 36 Couples In Srikakulam District - Sakshi

ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లి పుస్తకం

36 జంటలకు ఒకే ముహూర్తంలో వివాహం

శ్రీకాకుళం జిల్లా నువ్వల రేవు ప్రత్యేకత

వజ్రపు కొత్తూరు రూరల్‌: శ్రీరస్తు.. శుభమస్తు.. అంటూ సామూహిక పెళ్లి పుస్తకాలను లిఖిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నువ్వల రేవు గ్రామస్తులు. ప్రేమికుల దినోత్సవం రోజైన ఆదివారం 36 జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించి తమ ఆచారాన్ని కొనసాగించారు. ఇక్కడి వారంతా మత్స్యకారులే కావడంతో చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంపాదన నామమాత్రమే కావటంతో దశాబ్దాల కిందట గ్రామ పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం చేశారు. ఒక్కొక్కరు వివాహాలు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని కాబట్టి.. గ్రామంలో పెళ్లీడుకు వచ్చిన వారందరినీ గుర్తించి ఒకేసారి వివాహాలు చేయడం, వధూవరుల బంధువులందరికీ సామూహికంగా భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని భావించారు.

అప్పటినుంచి ఇప్పటివరకూ అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడే సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించి.. ఆ మేరకు 36 జంటలను ఏకం చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకే వేదికపై 36 మంది పురోహితులు ఏకకాలంలో వేద మంత్రాలు జపించగా.. తాళి కట్టే శుభవేళ ఊరు ఊరంతా మంగళధ్వనులతో మార్మోగింది. నూతన జంటలను ఆశీర్వదించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధుమిత్రులు తరలిరావడంతో నువ్వల రేవు జన సంద్రంగా మారింది.

చదవండి:
ఆ కుటుంబం ఓటమి ఎరగదు..

హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top