ప్లీజ్‌.. మరో ముహూర్తం చూడు స్వామీ! 

Marriages Are Being Postponed Due To Covid - Sakshi

శుభకార్యాలపై వైరస్‌ ప్రభావం

మంచి రోజులే అయినా తప్పని వాయిదా

రూ. కోట్లలోనే నష్టం

నగరానికి చెందిన సత్యనారాయణ, శేషశయనం ఇద్దరూ విశ్రాంత ఉద్యోగులు. వియ్యంకులుగా మారి బిడ్డల పెళ్లి ఘనంగా చేయడానికి పెద్ద ఫంక్షన్‌ హాలు మాట్లాడుకున్నారు. అయితే, కరోనా ప్రభావం ఉధృతం కావడంతో విధి లేక గణపతి సచ్చిదానందాశ్రమంలో కేవలం 10 మందితో తూతూ మంత్రంగా పెళ్లి కానిచ్చేయాల్సి వచ్చింది.  పెనుకొండకు చెందిన రమణ ఈ నెల 12న పెళ్లి పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితమే ముహూర్తం ఖరారవడంతో, బంధువులందరినీ పిలిచేశా డు. అయితే, కరోనా కారణంగా తక్కు వ మందితో కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పడంతో.. ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న రమణ ముహూర్తాన్నే వాయిదా వేసుకున్నాడు.   

సాక్షి, అనంతపురం: శుభకార్యాలపైనా కోవిడ్‌ పంజా విసిరింది. మహమ్మారి దెబ్బకు కర్ఫ్యూ అమలు చేయగా.. పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. వైరస్‌ కారణంగా జిల్లాలో వందలాది పెళ్లిళ్లకు అర్ధాంతరంగా బ్రేకులు పడినట్లు తెలిసింది. దీంతో పచ్చని తోరణాలు కనపడడం లేదు. బాజాభజంత్రీల మోతలు లేకుండా పోయాయి.  

మహూర్తాలు బలమైనవే.. అయినా..  
నాలుగు నెలలుగా శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యమి, శూన్యమాసాలతో శుభకార్యాలు ఆగిపోయాయి. ఈ నెల 12 నుంచి సుమూహూర్తాలు అధికంగా ఉండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. దాదాపు ఈ నెలలో కొన్ని మినహా అన్నీ మంచి రోజులు కావడంతో నాలుగు నెలల కిందటే ఫంక్షన్‌ హాల్స్‌లో ముహూర్తాలు ఖరారయ్యాయి. ఇప్పుడవి వైరస్‌ దెబ్బతో వాయిదా పడ్డాయి. వైశాఖ మాసం జూన్‌ 10 వరకు ఉంటుంది. తర్వాత జ్యేష్ట మాసం జూలై 9తో ముగుస్తుంది. అంత వరకూ మంచి  ముహూర్తాలున్నాయి. తర్వాత ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు. అంటే మళ్లీ ఆగష్టులో వచ్చే శ్రావణ మాసం వరకు ఆగాల్సి రావడంతో పురోహితులు మథన పడుతున్నారు. 

నష్టం రూ.కోట్లలోనే : 
జిల్లా కేంద్రంలోని చాలా ఫంక్షన్‌ హాల్స్‌లో ఒక పెళ్లి చేయాలంటే రెండు రోజులకు ఎంత లేదన్నా రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉండే 500కు పైగా పెళ్లివేదికలపై బాజా భజంత్రీలు ఆగిపోతుండడంతో నష్టం రూ. కోట్లలోనే ఉంటుందని శ్రీ సెవన్‌ ఫంక్షన్‌ హాలు నిర్వాహకులు అంబటి ఆదినారాయణరెడ్డి తెలిపారు. అనుబంధంగా ఉండే డెకరేషన్స్, క్యాటరింగ్, భజంత్రీలు, గిఫ్ట్‌ అండ్‌ నావల్టీస్‌తో పాటు ఇతర సేవలూ ఆగిపోతుండడం వల్ల నష్టం పూడ్చుకోలేని విధంగా ఉంటుందని ఆయన చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top