
పాలపొంగులా జలపాతం పరవళ్లు
వెలుగుల దివ్వె పుట్టింది ఇక్కడే
ఆధ్యాత్మికంగాను గుర్తింపు
సినిమా షూటింగులకు ఫోర్‌బే డ్యాం
వనాల మధ్య గలగలా సీలేరు నదీ ప్రవాహం
ప్రకృతిసిద్ధ అందాలకు నెలవు అల్లూరి జిల్లాలోని పొల్లూరు. ఈ ప్రాంతం జలవిద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా పర్యాటకంగాను గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తుండగా.. పొల్లూరు జలపాతం.. సీలేరు నది ఉరకలేస్తూ పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతోంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం, ఏవీపీ డ్యామ్, ఫోర్‌బే డ్యామ్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మోతుగూడెం: సీజన్‌తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లి వచ్చిన వారంతా ఈ ప్రాంత సందర్శనకు వస్తుంటారు.
» ఇక్కడి జలవిద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ఇక్కడ 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా అదనంగా మరో 230 మెగావాట్ల ఉత్పత్తికి 5,6 యూనిట్లు నిర్మిస్తున్నారు.
» పొల్లూరు జలపాతం..అలసిపోయిన మనసుకు ఈ ప్రాంతం ఎంతో హాయినిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరకలేస్తోంది. చూడచక్కని ప్రకృతిలో కొండలమధ్య ప్రవహిస్తూ సందర్శకుల మదిని దోచేస్తోంది. డొంకరాయి ఏవీపీ డ్యామ్ అదనపు నీరు, కొండవాగుల ప్రవాహం ఈ జలపాతంలో చేరుతుంది.
» ఫోర్‌బే డ్యామ్ ప్రత్యేక కట్టడంగా గుర్తింపు పొందింది. పవర్ కెనాల్ నుంచి వచ్చే నీటిలో సుమారు 0.5 టీఎంసీలు ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ డ్యామ్‌లో నిల్వ ఉంటుంది. ఇక్కడి నుంచి అండర్‌గ్రౌండ్ టన్నల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వెళ్తుంది. దీనిని పూర్తిగా మట్టితో నిర్మించారు. కొండలు, పచ్చదనంతో పరిసరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు
» సీలేరు నది.. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు పొల్లూరు నుంచి ప్రారంభమై చింతూరు వద్ద శబరినదిలో కలుస్తుంది. నది పొడవునా దట్టమైన వనాలతో ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. నది వడివడిగా ప్రవహించడం వల్ల దిగేందుకు పర్యాటకులు సాహసించరు.

సరిహద్దు పండగ.. మన్యంకొండ జాతర
ఇక్కడికి సమీపంలోని ఒడిశాకు చెందిన మన్యం కొండ గ్రామం ఆధ్యాత్మికంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో మూడేళ్లకోసారి జరిగే మన్యంకొండ జాతర ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. కొండ గుహలో పోతురాజు, బాలరాజు, కన్నమరాజు దేవతామూర్తులు కొలువుదీరారు. మూడేళ్లకోసారి వీరి ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువచ్చి జాతర నిర్వహిస్తారు.
మన్యంకొండనుంచి భారీ ఊరేగింపుతో సీలేరు నదిని దోనెపై దాటించి పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువెళ్లి మంగళస్నానం చేయిస్తారు. ఈ సమయంలో దర్శనమిచ్చే బంగారు చేపకు నమస్కరించుకుంటారు. గిరిజన సంప్రదాయ ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో తేదీ నిర్ణయించి పండగ జరిపిస్తారు. మల్కన్‌గిరి కలెక్టర్ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
మౌలిక వసతులపై అటవీశాఖ దృష్టి
» జాతీయ రహదారి నుంచి జలపాతం వద్దకు వెళ్లే మార్గాన్ని గ్రావెల్‌తో నిర్మించింది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యం కల్పించింది.
» పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, తాత్కాలిక షెడ్లు నిర్మించింది. జలపాతంలోకి పూర్తిగా వెళ్లకుండా సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసింది. వీటికి రూ.13 లక్షలు వెచ్చించినట్టు అటవీశాఖ రేంజర్ నానాజి తెలిపారు.ఫోర్‌బే డ్యామ్, పుష్ప బ్రిడ్జి, సీలేరు నది ప్రాంతాల్లో సందర్శకుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యాటకులకు ప్రదేశాన్ని చూపించేందుకు నియమించిన ఐదుగురు యువకులు ఉపాధి పొందుతున్నారన్నారు.
రూ.45 లక్షల మంజూరు
పొల్లూరు జలపాతంతోపాటు ఇతర ప్రదేశాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు రూ.45 లక్షలు ఏపీ జెన్‌కో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటోంది.
అద్భుతం జలపాతం
విజయవాడ నుంచి సుమారు 15 మంది మిత్రులతో కలిసి పొల్లూరు, మోతుగూడెం పరిసర ప్రాంతాలు తిలకించేందుకు వచ్చాం. పొల్లూరు జలపాతం అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు మైమరిపించాయి. – సతీష్, జియాలజిస్ట్, విజయవాడ
చాలా సరదాగా గడిపాం
పొల్లూరు జలపాతం, సీలేరు నది అందాలు చాలా ఆకట్టుకున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదాన్ని పొందాం. సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా గడిపాం. మరిచిపోలేనంతగా అనుభూతి పొందాం. – కె.రూప, భద్రాచలం