
వైఎస్ జగన్ పర్యటనతో పెరిగిన మామిడి ధర
ర్యాంపుల్లో కేజీ రూ.4 నుంచి రూ.6.50.. ఇక్కడి నుంచి క్రిష్ణగిరి, నాసిక్‌కు ఎగుమతులు
అక్కడ కేజీ రూ.8 నుంచి రూ.8.50 వరకు.. చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల్లో మాత్రం పాత ధరలే
పట్టించుకోని అధికారులు.. మండిపడుతున్న రైతులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇన్నాళ్లూ మామిడి రైతులు అష్టకష్టాలు పడ్డారు. తోతాపురి అమ్మకానికి పడరానిపాట్లు పడ్డారు. నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీల వద్ద మామిడి పంటను వాహనాల్లో ఉంచుకుని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. కనీస గిట్టుబాటు ధర రాక ఉసూరుమన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌ను సందర్శించి రైతుల ఆవేదన విన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాన్ని కడిగిపారేశారు. దీంతో వ్యాపారుల్లో కాస్త చలనం వచ్చింది. ఫలితంగా తోతాపురి మామిడికి ర్యాంపుల్లో కిలో రూ.4 నుంచి రూ.6.50 వరకు పలుకుతోంది.
క్రిష్టగిరి, నాసిక్‌కు ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలోని మ్యాంగో ఫ్యాక్టరీలు కనీసం రెండు మూడు రూపాయలకు కూడా కొనుగోలు చేయక పోవడంతో చాలా మంది రైతులు కోతలు కోయకుండా చెట్లపైనే కాయలను వదిలేశారు. వీటిలో చాలా వరకు కుళ్లిపోయి, నేల రాలాయి. ఇంకా 30–40 శాతం పంట అలానే ఉంది. అయితే వైఎస్ జగన్ పర్యటన అనంతరం ర్యాంపుల్లో ధర పెరగడంతో మిగిలిన పంటను అమ్ముకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు.
ర్యాంపుల్లో తోతాపురి కేజీ రూ.4 నుంచి రూ.6.50 వరకు వ్యాపారులు కొంటున్నారు. ఆపై వారు తమిళనాడులోని క్రిష్ణగిరి వద్ద ఉండే ఫ్యాక్టరీల్లో కిలో రూ.8 నుంచి రూ.8.50 వరకు అమ్ముకుంటున్నారు. అలాగే నాసిక్‌కు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఎగుమతులు గత రెండు రోజుల నుంచి పుంజుకున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 24 ర్యాంపులు ఉండగా, వీటి ద్వారా సుమారు 1200 టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు వెళుతున్నాయి. మరో 1500 టన్నులకు పైగా నాసిక్‌కు ఎగుమతి అవుతోంది.

స్థానిక ఫ్యాక్టరీల్లో పాత ధరలే
తమిళనాడులోని క్రిష్ణగిరి, హోసూర్ తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో తోతాపురికి కొంచెం మంచి ధర ఉంది. అయితే చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలు మాత్రం ప్రభుత్వ అండ చూసుకుని పాత ధరలతోనే కొనుగోళ్లు చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఏ రేటుకు కొనుగోలు చేస్తున్నారో కూడా రైతులకు చెప్పడం లేదు. పక్క రాష్ట్రంలో తోతాపురి ధరలు పెరిగినా, ఇక్కడ ఎందుకు పెరగడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.