ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు.. నేడు అనాథ శవంలా మార్చురీలో

Man Who Cremated Orphan Bodies Died - Sakshi

విశాఖపట్నం: జీవితం అంతుచిక్కని మలుపుల వింత ప్రయాణం. ఏ పయనం ఎక్కడ మొదలవుతుందో.. ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో అంచనా వేయడం అసాధ్యం. కొందరికి బతుకు వేడుకైతే.. మరికొందరికి వేదన. కొందరి ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతే.. మరికొందరి బతుకంతా అజ్ఞాతమే.. ఆ అనాథ యువకుడి జీవితం రెండో కోవకే చెందుతుంది. శ్మశానమే సర్వస్వమైన అతడిని.. అక్కడకు చేరువులోనే సంచరించిన మృత్యువు తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. అతను ఎన్నో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. నేడు ఆ యవకుడి మృతదేహం కేజీహెచ్‌ మార్చురీలో అనాథ శవంలా ఉంది.  

కాన్వెంట్‌ జంక్షన్‌ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో పోలిపల్లి పైడిరాజు(35) 15 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. నగరానికి చెందిన వాడే అయినా.. ఆలనాపాలనా చూసేవారెవరూ లేకపోవడంతో అక్కడా ఇక్కడా కాలం గడిపి చివరికి శ్మశానానికి చేరుకున్నాడు. పైడిరాజు చిన్న వయసులోనే తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. అన్నయ్య ఉన్నా.. అతడికి దూరంగా ఉంటున్నాడు. శ్మశానంలో పని చేస్తున్న మరికొందరితో కలిసి ఉంటున్నాడు. పైడిరాజు సేవ విలువకట్టలేనిది. అనాథలు.. అభాగ్యులే కాదు. డబ్బున్న వారెందరికో తనే తలకొరివి పెట్టాడు. 

కుమారులు, కుమార్తెలు విదేశాల్లో ఉండి.. ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఎందరో తల్లులు.. తండ్రులకు తనే కుమారుడిగా తలకొరివి పెట్టిన రోజులెన్నో. గతేడాది సురేష్‌ అనే కూలీ అనారోగ్యానికి గురయ్యాడు. పనిచేసే ఓపిక నశించడంతో.. గత్యంతరం లేక యాచక వృత్తిలో పడ్డాడు. సురేష్ కు   ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. అనాథ శవంగా మిగిలిపోయిన సురేకు అతని కుమారుడి చేతుల మీదుగా పైడిరాజు అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అభాగ్యులు.. అనాథలకు అన్నీ తానై అంతిమ సంస్కరణలు నిర్వహించాడు. ఎంతో మందికి పాడి కట్టాడు. నా అనే వారు లేక చనిపోయిన వారిని ఊరేగిస్తున్న క్రమంలో విసిరిన డబ్బులకు పైడిరాజు అలవాటు పడ్డాడు. ఆ వచ్చే డబ్బులతో పూట గడిచేది. అలా శ్మశానవాటికకు చేరువయ్యాడు. ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top